తెలంగాణ కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ కీల‌క నేత‌!

Update: 2022-10-08 05:08 GMT
తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ క‌దులుతోంది. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు క‌దులుతోంది. ఇప్ప‌టికే పార్టీలో పెద్ద ఎత్తున చేరిక‌లు కొన‌సాగాయి. అక్టోబ‌ర్ నెలాఖ‌రులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌లో ప్ర‌వేశించ‌నుంది. దీంతో ఆ పార్టీ న‌వోత్సాహంతో తొణిక‌స‌లాడుతోంది. ఇక ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న మునుగోడులో అంద‌రికంటే ముందుగానే ప‌క్కా ప్ర‌ణాళిక‌, వ్యూహంతో ముందుకు క‌దులుతోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ కు చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు చేరనున్నార‌ని స‌మాచారం. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టీడీపీ త‌ర‌ఫున ఖ‌మ్మం జిల్లా స‌త్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఘ‌న‌విజ‌యం సాధించారు. 2009లో టీడీపీ త‌ర‌ఫున ఖ‌మ్మం నుంచి పోటీ చేసి గెలిచారు. 2016లో టీఆర్ఎస్ త‌ర‌ఫున పాలేరు నుంచి గెలుపొందారు. 1999లో నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న కేబినెట్‌లో భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా విధులు నిర్వ‌ర్తించారు.

2018 ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కందాల ఉపేంద‌ర్ రెడ్డి ఇక్క‌డ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ఉపేంద‌ర్ రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుంద‌ని స‌మాచారం. దీంతో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును టీఆర్ఎస్ పార్టీలో ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు తుమ్మ‌ల టీడీపీలోనే ఉన్నారు. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ‌లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో తుమ్మ‌ల కీల‌క నేత కావ‌డంతో కేసీఆర్ కూడా ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌త ఇచ్చారు. ఏకంగా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత 2016లో పాలేరు ఉప ఎన్నిక‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌నను పోటీ చేయించి గెలిపించారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్ప‌టి నుంచి టీఆర్ఎస్ లో తుమ్మ‌ల ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌చ్చింద‌ని అంటున్నారు. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేర‌డం, ఖ‌మ్మం వెళ్లిపోదామ‌నుకున్నా అక్క‌డ పువ్వాడ అజ‌య్ ఉండ‌టం వంటి కార‌ణాలతో తుమ్మ‌ల‌కు సేఫ్ సీటు లేకుండా పోయింది. టీఆర్ఎస్ స‌మావేశాల‌కు కూడా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌డం లేద‌ని చెప్పుకుంటున్నారు. ఒక‌ప్పుడు తుమ్మ‌ల‌ను అత్యంత స‌న్నిహితుడిగా భావించి ఆయ‌న‌ను దగ్గ‌ర‌కు చేర‌దీసి మంత్రిప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు.. కేసీఆర్. అలాంటిది ఇప్పుడు ఆయ‌నే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు.

దీంతో కొంత‌కాలంగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు కొన‌సాగుతూ వ‌స్తున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు త‌న అనుచ‌రుల‌తోనూ చ‌ర్చించార‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News