ఎర్ర‌బెల్లికి గులాబీ నేత దిమ్మ తిరిగే స‌వాల్‌

Update: 2018-09-15 10:45 GMT
ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌పై స‌వాళ్లు విస‌ర‌టం.. అందుకు స‌మాధానంగా ప్ర‌తిస‌వాళ్ల‌తో స్పందించ‌టం చూస్తుంటాం. కానీ.. గులాబీ నేత‌లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు.. అసంతృప్తులు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

టికెట్ల‌ను ఆశించిన ఆశావాహులు అధినేత నిర్ణ‌యంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. త‌మ‌కు అవ‌కాశం రాకుండా అడ్డుప‌డిన నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. అలాంటిదే వ‌రంగ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది. పాల‌కుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అభ్య‌ర్థిత్వాన్ని కేసీఆర్ క‌న్ఫ‌ర్మ్ చేశారు.

అయితే.. ఎర్ర‌బెల్లిని అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌టంపై అదే స్థానం నుంచి టికెట్ ఆశించిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొండా దంపతుల‌కు ఆగ‌ర్భ శ‌త్రువులుగా చెప్పుకునే ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ తూర్పు నుంచి కొండా దంప‌తుల‌పై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాలు విసిరారు.

పార్టీ కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల అభీష్టం మేర‌కు మాత్ర‌మే తాను పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను ఆశిస్తున్న‌ట్లుగా చెప్పిన ర‌వీంద‌ర్ రావు ఎర్ర‌బెల్లిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపై పార్టీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెప్పారు. పాల‌కుర్తి టికెట్ ను ఇప్ప‌టికైనా త‌న‌కు కేటాయించ‌ని ప‌క్షంలో కార్య‌క‌ర్త‌ల అభీష్టం మేర‌కు తాను తుది నిర్ణ‌యం తీసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌త్య‌ర్థుల సంగ‌తి త‌ర్వాత సొంత పార్టీ నేత‌లే  స‌వాలు చేస్తున్న తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. ఈ స‌వాల్ పైన ఎర్ర‌బెల్లి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News