గుంభ‌నంగా కేసీఆర్‌.. గుబులుగా గులాబీ నేత‌లు

Update: 2019-02-13 05:16 GMT
రాష్ట్రం ఏదైనా కానీ అధికార‌ప‌క్షం హ‌డావుడి ఎంత ఉండాలి?  కానీ.. తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా కేసీఆర్ పెద్ద సాహ‌స‌మే చేశార‌న్న భావ‌న‌తో పాటు..లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చి పెట్టుకున్నార‌న్న విమ‌ర్శ‌ల్లో ఎలాంటి ప‌స లేద‌న్న విష‌యాన్ని తుది ప‌లితం ద్వారా కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశారు. వంద‌కు పైగా సీట్లు ఖాయ‌మ‌ని చెబుతూనే.. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర ఆ ఫిగ‌ర్ కు వ‌చ్చిన కేసీఆర్ తెలంగాణ‌లో తిరుగులేని అధికార‌ప‌క్షంగా మారారు.

తానేం చెబితే.. అది జ‌రిగే ప‌రిస్థితి తెలంగాణ‌లో చోటు చేసుకుంది. ఈ ధైర్యమే ఆయ‌న్ను రెండు నెల‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌కుండా చేసింద‌ని చెప్పాలి. దేశంలో మ‌రే రాష్ట్రంలో చోటు చేసుకోనిరీతిలో.. ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక్క మంత్రితో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న కేసీఆర్ కార‌ణంగా.. రాష్ట్ర ప‌ని తీరు ఇప్పుడు ప‌డ‌కేసింన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చినంత‌నే త‌మ‌కు ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశ‌గా చూసిన నేత‌ల‌కు కేసీఆర్ తీరు షాకింగ్ గా మారింది. ఎవ‌రికి అందుబాటులో ఉండ‌ని అధినేత తీరు ఒక‌టైతే.. మంత్రుల ప‌ద‌వులు కూడా ఇవ్వ‌కుండా ఇలా కాలం గ‌డిపేయ‌టం ఏమిట‌న్న ఆవేద‌న ప‌లువురు గులాబీ నేత‌ల్లో క‌లుగుతోంది. త‌న‌కు తోచిన‌ట్లుగా చేస్తున్న కేసీఆర్ తీరు కార‌ణంగా.. త‌మ ప‌ద‌వుల‌కు ముప్పు క‌లుగుతుందేమోన‌న్న భ‌యాందోళ‌న‌లు ప‌లువురు సీనియ‌ర్ల‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రోవైపు.. ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న ధీమా ఉన్న‌ప్ప‌టికీ.. లోప‌ల ఏదో శంక‌తో గులాబీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టెన్ష‌న్ తో త‌ల్ల‌డిల్లిపోతున్నారు. త‌మ బాధ సారుకు అర్థం కాదా? అన్న క్వ‌శ్చ‌న్ ప‌లువురి నోట వినిపిస్తోంది. దీంతో.. సారు క‌రుణా వీక్ష‌ణాల కోసం గులాబీ నేత‌లు త‌పిస్తున్నారు. ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ మాత్రం గుంభ‌నంగా ఉంటున్నారు. ఏదైనా కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా తాను చెప్పాల్సిన రెండు మాట‌లు చెబుతున్నారే కానీ.. ప‌ద‌వుల పంప‌కం గురించి మాట కూడా చెప్ప‌ని ప‌రిస్థితి. దీంతో.. గులాబీ నేత‌ల్లో కిందామీదా ప‌డుతున్నారు.

రెండు నెల‌లు గ‌డుస్తున్నా మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌కుండా (ఒక్క‌రు ఉన్నార‌నుకోండి).. అదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటున్న కేసీఆర్ తీరుతో కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు ఫ‌స్ట్రేట్ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. చేతిలో ప‌వ‌ర్ ఉన్నా కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేని దుస్థితి ప‌గోడికి కూడా రావొద్దంటూ త‌మ ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో కొంద‌రు గులాబీ నేత‌లు వాపోతున్నారు. అదే స‌మ‌యంలో.. త‌మ నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు బ‌య‌ట‌కు పొక్కితే త‌మ రాజ‌కీయ ఉనికికే ప్ర‌మాద‌మ‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. పార్టీ నేత‌ల్ని త‌న గ్రిప్ లో ఉంచుకున్న కేసీఆర్ మామూలోడు కాద‌న్న మాట‌ను ఎవ‌రూ కాద‌న‌లేని ప‌రిస్థితి.



Tags:    

Similar News