మంత్రులతో కలిసి స్పీకర్ కూడా మొదటి రోజే కోడ్ ఉల్లంఘన ..!

Update: 2019-12-25 09:32 GMT
తాజాగా తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి గంట కొట్టిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ..రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో  పాల్గొనకూడదు. కానీ , ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రెండో రోజే అంటే మంగళవారమే నలుగురు మంత్రులు - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఎలక్షన్ కోడ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మినిస్టర్లు ఐకేరెడ్డి - ప్రశాంత్ రెడ్డి - పువ్వాడ అజయ్ కుమార్ - గంగుల కమలాకర్ - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి   మంగళవారం నిర్మల్ జిల్లాలో పర్యటించి - ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాలోని మిషన్‍ భగీరథ పనులు - సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు వీరిద్దరూ సదర్మట్ - చనఖ కోర్ట బ్యారేజీ పనులను పరిశీలించారు. ఈ బ్యారేజీలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 - 28 పనుల్లో వేగం పెంచాలని -  భగీరథ పనులు పూర్తిచేసి - ఇంటింటికీ తాగు నీరివ్వాలని  రాష్ట్ర అటవీ - దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.

అలాగే, పల్లె ప్రగతి అమలుపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద ఉన్నతెలంగాణ సౌత్ క్యాంపస్ లో లీడర్లు - ఆఫీసర్లతో ఆర్ అండ్ బీ - గృహనిర్మాణ - శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇకపోతే నిజామాబాద్ జిల్లా వర్నిమండలం తగిలెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇళ్లను మంగళవారం స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

అలాగే , మరో మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.6.40 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. టీఆర్ ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన  ఈ సందర్భంగా చెప్పారు. ఇక కరీంనగర్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ టవర్ లో కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం హైదరాబాద్ లోని టీఎస్ ఐఐడీసీ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఇలా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మరుసటి రోజే మంత్రులు - స్పీకర్ సైతం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News