ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ ను అరెస్ట్ చేశారు కానీ..

Update: 2017-07-13 06:06 GMT
మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు.. వారి గౌర‌వానికి భంగం వాటిల్ల‌కుండా చూడ‌టం.. వారి ప‌రువు ప్ర‌తిష్ట‌ల్ని కాపాడే విష‌యంలో ఎంత‌కైనా రెడీ అని చెప్పే తెలంగాణ రాష్ట్రంలో అధికార‌పార్టీ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ తీరు సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే. మ‌హబూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ప్రీతిమీనా ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన ఉదంతంలో ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ప్రీతి మీనా చేతిని ప‌ట్టుకున్న ఎమ్మెల్యే అనుచిత వైఖ‌రి ప‌ట్ల సీఎం కేసీఆర్ సీరియ‌స్ కావ‌టం.. త‌క్ష‌ణ‌మే క‌లెక్ట‌ర్‌ కు సారీ చెప్పాల‌ని.. అతి చేస్తే పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తాన‌ని హెచ్చ‌రించిన సీఎం దెబ్బ‌కు శంక‌ర్ నాయ‌క్ క‌లెక్ట‌ర్‌ ను క్ష‌మాప‌ణ‌లు కోరారు. పొర‌పాటున త‌న చేయి త‌గిలింద‌ని.. ఆమెను ఈ ఘ‌ట‌న బాధిస్తే సారీ అని చెప్పారు.

ఇదిలా ఉంటే.. శంక‌ర్ నాయ‌క్ తీరుపై మీడియాలో పెద్ద ఎత్తున వ‌చ్చిన క‌థ‌నాలు.. ఈ ఉదంతాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లిన వెంట‌నే ఆయ‌న తీవ్రంగా స్పందించ‌టంతో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయింది. క‌లెక్ట‌ర్ తో అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాజాగా ఆయ‌న్ను మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణ పోలీసులు ఈ రోజు ఉద‌యం అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన అనంత‌రం ఎమ్మెల్యే పూచీక‌త్తు మీద పోలీస్ స్టేష‌న్ నుంచి బెయిల్ మంజూరు చేసిన‌ట్లుగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చెబుతున్నారు. బ‌హిరంగంగానే ఉన్న‌త అధికారిణిపై అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన నిందితుడికి పూచీక‌త్తుపై బెయిల్ ఇవ్వ‌టంపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News