కేసీఆర్‌ కు ఇంకో షాక్‌..బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ

Update: 2019-03-27 16:23 GMT
ఊహించిందే నిజ‌మైంది. కేసీఆర్ ఊహించిన రీతిలో ట్విస్ట్ ఇవ్వ‌గా...ఆయ‌న‌కు అదే రీతిలో షాక్ ఇచ్చారు. ఇలా షాక్ ఇచ్చింది మ‌రెవరో కాదు...ఆ పార్టీకి చెందిన ఎంపీ - శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ జితేంద‌ర్ రెడ్డి. తాజాగా ఆయ‌న బీజేపీ గూటికి చేరారు. టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ జితేంద‌ర్ రెడ్డి కాషాయ కండువా క‌ప్పుకొన్నారు.

టీఆర్ ఎస్‌ అధినేత కేసీఆర్ ఇటీవ‌ల లోక్‌ సభ అభ్యర్థులను ప్రకటించగా ఇందులో 8 స్థానాల్లో సిట్టింగ్‌ లకు మళ్లీ అవకాశమిచ్చారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి - సీతారాం నాయక్ - గుత్తా సుఖేందర్‌ రెడ్డి - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పక్కనబెట్టిన కేసీఆర్.. వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశమిచ్చారు. ఈ ఎపిసోడ్‌ పై మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి క‌ల‌త చెందిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని - టీఆర్ ఎస్‌ టికెట్ రాకపోతే... ఆ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తారని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ ప్ర‌చారాన్ని ఎంపీ జితేందర్ రెడ్డి ఖండించారు.  గిట్టని వారు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశానన్న జితేందర్ రెడ్డి.. తాను ఏ పార్టీతో టచ్‌ లో లేనన్నారు. అయితే, వెంట‌నే ఆయ‌న స్టాండ్ మార్చేశారు. బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి రామ్ మాధవ్‌ తో క‌లిసి చ‌ర్చించిన జితేంద‌ర్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. అమిత్ షా ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకొన్నారు. టీఆర్ ఎస్ లోక్‌ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేర‌డంలో రామ్‌ మాధ‌వ్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చేరిక‌కు టీఆర్ ఎస్‌ కు పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ప‌లువురు భావిస్తున్నారు. జితేంద‌ర్ రెడ్డి చేరిక‌పై టీఆర్ ఎస్ పార్టీ స్పందించాల్సి ఉంది.


Tags:    

Similar News