క‌విత‌ కోరిక - ఆ బిల్లు కూడా ఇలా ఆమోదం పొందాల‌ట‌!

Update: 2019-01-10 09:44 GMT
గ‌త మూడు రోజులుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి రిజ‌ర్వేష‌న్లు. అగ్ర‌వ‌ర్ణ కులాల్లోని పేద‌ల‌కు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్ల‌మెంటు ఆగ‌మేఘాల మీద ఆమోదించింది. రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేయ‌డ‌మే త‌రువాయి దేశ‌వ్యాప్తంగా ఈ కోటా అమ‌ల్లోకి రానుంది.

కోర్టుల్లో ప‌లువురు వేస్తున్న కేసుల‌కు అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌ రిజ‌ర్వేష‌న్ నిల‌బ‌డుతుందా లేదా అన్న‌ది త‌రువాత సంగ‌తి. ఒక్క విష‌యం మాత్రం తాజా వ్య‌వ‌హారంతో స్ప‌ష్ట‌మైంది. అదేంటంటే.. కేంద్రం అనుకుంటే ఏ బిల్లునైనా ఆమోదింప‌జేసుకోగ‌ల‌ద‌ని. నిజానికి 4 రోజుల క్రితం వ‌ర‌కు అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ అంశం ఎక్క‌డా ప్ర‌స్తావ‌న‌కు కూడా రాలేదు. సోమ‌వారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం కేబినెట్ నోట్ లో దాన్ని చివ‌రి క్ష‌ణాల్లో చేర్చారు. త‌ర్వాత రోజు లోక్ స‌భ‌లో, ఆ మ‌రుస‌టి రోజు రాజ్య‌స‌భ‌లో బిల్లుకు ఆమోదం ద‌క్క‌నే ద‌క్కింది.

ఈ వ్య‌వ‌హారం పై టీఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత తాజాగా స్పందించారు. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఆమోదం ల‌భించిన‌ట్లే మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ బిల్లుకు కూడా పార్ల‌మెంటు ఆమోదం ద‌క్కాల‌ని అభిల‌షించారు. అంతే వేగంగా పార్ల‌మెంటులో మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ బిల్లు ముందుకు క‌ద‌లాల‌ని ఆకాంక్షించారు. అందుకు రాజ‌కీయంగా మ‌రింత దృఢ సంక‌ల్పం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. మ‌హిళా బిల్లు విష‌యంలోనూ పార్ల‌మెంటు సభ్యులు ఇంత వేగంగా క‌దిలిన‌ప్పుడే దేశం దేశం నిజమైన ప్రగతి సాధించినట్ల‌వుతుంద‌ని క‌విత ట్వీట్ చేశారు.

క‌విత కోరిక మంచిదే అయిన‌ప్ప‌టికీ.. అది నెర‌వేరే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌స్థాన్ - మ‌ధ్య‌ప్ర‌దేశ్ - ఛ‌త్తీస్ గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం బీజేపీకి గ‌ట్టి గుణ‌పాఠ‌మ‌ని వారు పేర్కొన్నారు. త‌మ‌కు ఏళ్లుగా మ‌ద్ద‌తుగా ఉంటున్న అగ్ర‌వ‌ర్ణ ప్ర‌జ‌లు దూర‌మ‌వుతుండ‌టాన్ని గ్ర‌హించింది కాబ‌ట్టే బీజేపీ ఇలా ఆగ‌మేఘాల మీద వారికి రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింప‌జేస్తోంద‌ని తెలిపారు. మ‌హిళా బిల్లు విషయంలో మాత్రం ఆ పార్టీకి తొంద‌ర లేద‌ని - క‌విత కోరిక నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు సుదీర్ఘ కాలంగా పార్ల‌మెంటులో పెండింగ్ లో ఉన్న సంగ‌తి గ‌మ‌నార్హం.




Full View
Tags:    

Similar News