ప‌వ‌న్ ప్ర‌సంగం కోసం క‌విత ఎదురుచూపు!

Update: 2016-08-27 05:03 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడ‌తారు... అంటే చాలు అంద‌రిలోనూ తెలియ‌ని ఒక ఆస‌క్తి నెల‌కొంటుంది. నిజానికి - ప‌వ‌న్ స్పంద‌న కోసం ఆంధ్రా ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌ని చెప్పాలి. ఎందుకంటే, ప్ర‌త్యేక హోదాపై తాజాగా ఎంత ర‌గ‌డ జ‌రుగుతోందో తెలిసిందే. కేంద్రం ఇచ్చేది లేదు పొమ్మంటోంది. ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామ‌న్న ధోర‌ణిలో ఉంది. కేంద్రంపై పోరాడి సాధించుకుందాం అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెబుతూ ఉన్నా.. ఆ పోరాట కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది ఇంకా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ స్పందిస్తారు అని ఎదురుచూశారు. అనూహ్యంగా ఈరోజు (శ‌నివారం) తిరుప‌తిలో స‌భ‌ను ఏర్పాటు చేశారు ప‌వ‌ర్ స్టార్‌. దీంతో ఏపీలో అంద‌రూ ఆస‌క్తిగా ప‌వ‌న్ ప్ర‌సంగం కోసం ఎదురుచూస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ ఎంపీ - ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత‌ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్టు తెలుస్తోంది!

తిరుప‌తిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌పై ఆమె ఎన‌లేని ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్న‌ట్టు స‌మాచారం. నిజానికి - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పై మొద‌ట్లో బాగానే సెటైర్లు వేసిన‌వారిలో క‌విత కూడా ఒక‌రు. ఇక‌, సీఎం కేసీఆర్ సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ మీద ఎన్నో వ్యంగాస్త్రాలు సంధించారు. తిరుప‌తి స‌భ‌లో తెలంగాణ‌కు సంబంధించిన కొన్ని అంశాల‌ను కూడా పవ‌న్ ప్ర‌స్థావించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ఎంసెట్‌-2 లీకేజీ వ్య‌వ‌హారం - మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితుల ఆందోళ‌నపై ప‌వ‌న్ స్పందించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతోపాటు తెలంగాణ‌లో రైతుల స‌మ‌స్య‌ల‌పై కూడా ప‌వ‌ర్ స్టార్ మాట్లాడొచ్చు.

కొన్నాళ్ల కింద‌ట ఒక అభిమానిని ప‌ల‌క‌రించేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖమ్మం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆరోజున అభిమానులు వెల్లువెత్తారు. తెలంగాణ‌లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పెద్ద సంఖ్య‌లోనే ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై కూడా ప‌వ‌న్ మాట్లాడితే బాగుండు అనే అభిప్రాయం చాలామంది అభిమానుల‌కు ఉంది. అభిమానుల మ‌నోగతం ప‌వ‌న్ వ‌ర‌కూ చేరింద‌ని, అందుకే తిరుప‌తి స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై కూడా ప‌వ‌న్ స్పందించి, కేసీఆర్ స‌ర్కారుపై స్పందించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణం ఉంది కాబ‌ట్టి, ప‌వ‌న్ ప్ర‌సంగం వినేందుకు నిజామాబాద్ ఎంపీ క‌విత ఆస‌క్తి చూపుతున్నార‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు! తిరుప‌తి స‌భ‌లో తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ స్పందిస్తే... వెంట‌నే క‌విత ప్ర‌తిస్పందిస్తార‌న్న‌మాట‌!
Tags:    

Similar News