టీఆర్ ఎస్ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డిందిగా!

Update: 2018-07-19 10:52 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి తాము మ‌ద్ద‌తిస్తామ‌ని - ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంలో అండ‌గా ఉంటామ‌ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ - ఎంపీ క‌విత‌లు కొద్ది రోజులుగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌నాంధ్ర‌ప్ర‌దేశ్ కు వీరిద్ద‌రు మ‌ద్ద‌తిస్తాన‌న‌డంతో ఏపీ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు - ఎన్డీఏపై టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ ఎస్ - బీజేడీలు మ‌ద్దతు తెల‌ప‌డంలేద‌ని వార్తలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీఆర్ ఎస్ లోక్‌ సభాపక్ష ఉపనేత బి.వినోద్‌ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని - దానిని ఏపీ కోర‌డాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం తాము కూడా పోరాడ‌తామ‌ని - ఆ విష‌యంలో గ‌తంలో ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి టీడీపీకి అండగా నిలుస్తామన్నారు. బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడిన వినోద్ అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు.

ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్ లోని పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాద‌ముంద‌ని వినోద్ అన్నారు. 2014లో తమిళనాడు దివంగ‌త‌ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని  కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు. క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ధ రామయ్య కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చార‌ని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసానికి టీఆర్ ఎస్ మద్దతివ్వాల‌ని టీడీపీ డిమాండ్‌ చేయడం స‌రికాద‌న్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో జ‌త‌క‌ట్టిన టీడీపీ ...హోదా విష‌యంపై ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌న్నారు. అవిశ్వాసం అంశం ఓటింగ్ కు వస్తుందని తాను భావించ‌డం లేద‌ని, వ‌చ్చిన‌పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. మ‌రోవైపు, రాష్ట్ర ప్రయోజనాల సాధ‌న‌కు స‌హ‌క‌రించే కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ‌ల్ల రాష్ట్రానికే నష్టమని టీఆర్ ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి అన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అంశం పై కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు.
Tags:    

Similar News