​టీఆర్ ఎస్ చెప్పిన పని చేస్తోంది!​ ​

Update: 2016-01-02 11:22 GMT
ఎన్నికల్లో విజయం సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ నాయకులు ఎంత దూరమైనా వెళతారు. దేనినైనా వదలుకుంటారు. దేనినైనా అక్కున చేర్చుకుంటారు. ఇందులో ఏమాత్రం మొహమాటం పడరు. గతంలో తాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వారిని అక్కున చేర్చుకోవడానికి కూడా వెనకాడరు. ఇప్పుడు అదే జరగనుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన వారికి కొంతమందికి సీట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. వారి ఓట్లను సాధించకుండా ఇక్కడ విజయం సాధించడం అనేది అంత సాధ్యం కాదు. గెలుపు ఓటముల్లో ఇక్కడ ముస్లిములు ఎంత ప్రభావం చూపుతారో సీమాంధ్రులు కూడా అంతే ప్రభావశీలంగా ఉంటారు. అదే సమయంలో టీఆర్ఎస్ మీద సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ పార్టీ వేరని, ఇప్పటి రాజకీయ పార్టీ వేరని, రాజకీయ పార్టీగా తాము సీమాంధ్రులకు కూడా పోటీ చేసే అవకాశం ఇస్తామని, భవిష్యత్తులోనూ అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు వీలుగా ఈసారి కొన్ని సీట్లను సెటిలర్లకు కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా, శేరిలింగంపల్లి - కూకట్ పల్లి - మాదాపూర్ - వనస్థలిపురం తదితర ప్రాంతాల్లోని సీట్లను సెటిలర్లకే కేటాయించాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా సీమాంధ్ర సెటిలర్లలోనూ కుల ప్రాబల్యాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలని యోచిస్తోంది.

సీమాంధ్రకు సంబంధించి ఇక్కడ స్థిరపడిన వారిలో కమ్మ సామాజిక వర్గమే హైదరాబాద్లోనూ ప్రాబల్య వర్గంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరఫున సీమాంధ్ర నుంచి వచ్చిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఆ పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News