టీఆర్ ఎస్ క‌నిపెట్టిన సీక్రెట్ ఏంటి?

Update: 2018-10-08 09:30 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలకు అన్నీ సిద్దం అవుతున్నాయి. అధికార రాష్ట్ర సమితి తిరిగి పవర్‌ లోకి వస్తామని గట్టిగా నమ్ముతోంది. మహాకూటమి కూడా విజయం తనదే అని ధీమాగా ఉంది. అన్ని పార్టీలు విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఎవరి లెక్కలు వారికున్న తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం స్పష్టమైన లెక్కలతో  ధీమాగా ఉంది. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు తాము అమలు చేసిన పథకాలే పవర్‌ లోకి తీసుకుని వస్తాయని గట్టిగా నమ్ముతోంది. ఈ పథకాల లబ్దిదారులే తమ ఓటు బ్యాంకు అని విశ్వసిస్తోంది. ఆసరా - వృద్దాప్య - ఒంటరి మహిళకు పింఛ‌ను - కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ - వ్యవసాయ రుణమాఫీ - రైతు బంధు - హాస్టల్స్ లో సన్నబియ్యం వంటి పథకాలు తమను ఒడ్డేక్కిస్తాయని గులాబీ నేతలు ఆశిస్తున్నారు. టిఆర్‌ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు ప్రతీ కుటుంబంలోను కనీసం ఇద్దరికి లబ్ది చేకూర్చాయని వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి విధేయులై ఉంటారని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. తెలంగాణలో దాదాపు 90 శాతం మంది దారిద్ర్య‌  రేఖకు దిగువనే ఉన్నారు, వారంతా ప్రభుత్వ పథకాలను ఏదో రూపంలో అనుభవించారని, ఇదే తమ గెలుపుకు పునాది అని భావిస్తున్నారు.

రైతులు ఎక్కువగా ఉన్న తెలంగాణలో అమలు చేసిన రుణమాఫీ - రైతు బంధు - రైతు జీవిత భీమా పథకాలు ప్రజలలోకి విస్తృతంగా వెళ్లాయని, ఈ పథకాల ద్వారా కనీసం 20 లక్షల కుటుంబాలు లబ్ది పొందాయన్నది టిఆర్‌ ఎస్ నాయకుల అంచనా. ఇలా లబ్ది పొందిన రైతులు - వారి కుటుంబ సభ్యులు కనీసంలో కనీసం 30 నుంచి 40 లక్షల మంది ఉంటారని అంచన వేస్తున్నారు. వీరి ఓట్లు తిరిగి టిఆర్‌ ఎస్‌ కే పడతాయని ఆ పార్టీ నాయకుల ధీమా. మిగిలిన పథకాలు కల్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ - ఆసరా - వృద్దాప్య - ఒంటరి మహిళకు పింఛ‌ను వంటి పథకాలు వల్ల లబ్ది పొందిన వారు 50 నుంచి 70 లక్షల మంది ఉంటారని - వీరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల సానుకూలంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇలా పథకాల వారిగా చూసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నల్లేరు మీద నడకే అని టీఆర్ ఎస్ భావిస్తోంది. పథకాలే తమను పవర్‌ లోకి తీసుకుని వస్తాయని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News