ఆ ఐదుగురిలో ఒకరికి ఛాన్స్..?

Update: 2015-10-26 03:43 GMT
వరంగల్ ఉప ఎన్నిక వేడి రగులుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటం..అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో.. ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. అభ్యర్థి ఎంపికతోనే యాభై శాతం గెలిచినట్లుగా ఉండే అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది. అభ్యర్థి పేరు విన్న వెంటన గెలుపు గుర్రానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వరంగల్ ఉఫ ఎన్నికకు టీఆర్ ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ తో రాత్రివేళ సుదీర్ఘ చర్చలు జరిపినా ఫలించలేదు. టీఆర్ ఎస్ ముఖ్యనేతలు కేకే.. హరీశ్ రావులు కలిసి వివేక్ తో భేటీ అయి.. పార్టీలోకి వస్తే టిక్కెట్టు పక్కా అని ఊరించిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ విషయం బయటకు పొక్కటం.. కాంగ్రెస్ అధినాయకత్వం సీన్లోకి వచ్చేసి వివేక్ తో మాట్లాడటంతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. వివేక్ ను కానీ బరిలోకి దింపితే అర్థికంగా.. సామాజికంగా.. రాజకీయంగా తమకు తిరుగులేదన్నట్లుగా ఉన్న టీఆర్ ఎస్ ఇప్పుడు అలాంటి అభ్యర్థి ఎవరన్న అంశంపై దృష్టి సారించింది.

ఇప్పటివరకూ చాలా పేర్లు తెర మీదకు వచ్చినా ఫైనల్ గా ఐదు పేర్లను తుదిజాబితాగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వరంగల్ ఉఫ ఎన్నిక గెలుపు తెలంగాణ అధికారపక్షానికి అనివార్యమైంది. ఈ ఎన్నికలో గెలిస్తే.. తన మీద విరుచుకుపడుతున్న విపక్షాల నోళ్లు మూయించటమే కాదు.. పదహారునెలల తమ పాలనకు ఈ విజయం ఒక రెఫరెండమ్ అని ప్రచారం చేసుకునే వీలుంది.

అందుకే.. వరంగల్ ఉఫ ఎన్నికలో విజయం అనివార్యంగా మారింది. ఇక.. అభ్యర్థుల విషయానికి వస్తే.. ప్రస్తుతం రేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్.. ప్రొఫెసర్ సాంబయ్య.. రవికుమార్.. దయాకర్.. పరంజ్యోతి ఉన్నారు. ఆ మధ్యన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సతీమణి పేరును పరిశీలించినట్లు చెప్పినా.. తర్వాత ఆ ఆలోచనను వదులుకున్నట్లుగా చెబుతున్నారు. అభ్యర్థి ఎంపికతోనే యాభై శాతం గెలిచినట్లుగా ఉండాలన్న టీఆర్ ఎస్ ఆలోచనకు తగ్గ పేర్లు ఇప్పుడు వినిపిస్తున్న ఐదు పేర్లలో లేదన్న మాట వినిపిస్తోంది. మరి.. తమ వ్యూహానికి తగ్గ అభ్యర్థిని తీసుకురాగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News