ముగ్గురు గెలిచినా..సంతోష్ పైనే ఫోక‌స్ అంతా!

Update: 2018-03-24 05:20 GMT
రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ముగిశాయి. ముందు నుంచి అనుకున్న‌ట్లే టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. త‌మ‌కు బ‌లం లేకున్నా.. జంపింగ్ ఎమ్మెల్యేల పుణ్య‌మా అని మూడో స్థానాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అయితే.. ఇవ‌న్నీ ముందు నుంచి అంచ‌నా వేసిన‌వే కావ‌టంతో ఎవ‌రికి ఎలాంటి స‌ర్ ప్రైజ్ లేదు.

బ‌లం ప‌క్కాగా ఉన్న అధికార‌ప‌క్షం అనుకున్న‌ట్లే ముగ్గురు అభ్య‌ర్థులు (సంతోష్‌.. బండ ప్ర‌కాశ్‌.. బ‌డుగుల లింగ‌య్య‌) రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయ‌గా.. 107 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. అసెంబ్లీ రికార్డుల ప్ర‌కారం కాంగ్రెస్ అనుబంధ స‌భ్యుడు దొంతి మాధ‌వ‌రెడ్డి త‌న ఓటును కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌ కు చూపించిన కార‌ణంగా ఆయ‌న ఓటు చెల్లుబాటు కాద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ తేల్చింది.

ఇది మిన‌హా.. మిగిలిన‌వ‌న్నీ అనుకున్న‌ట్లే జ‌రిగిపోయాయి.ముగ్గురు టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల గెలుపు ఊహించిందే అయినా.. ఈరోజు పేప‌ర్లు చూసిన వారికి ముగ్గురిలో సంతోష్ ఎంత ప్ర‌త్యేక‌మ‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు మాత్ర‌మే కాదు.. ఇంగ్లిషు ప‌త్రిక‌ల్లోనూ కేసీఆర్ బంధువు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ కు అభినంద‌న‌లు తెలుపుతూ ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో పాటు.. పారిశ్రామిక సంస్థ‌లు.. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

సంతోష్ తో పాటు గెలిచిన మ‌రో ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు (బండ ప్ర‌కాశ్‌.. బ‌డుగుల లింగ‌య్య‌) పేర్ల మీద ఒక్క‌టంటే ఒక్క ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. గెలుపు ముగ్గురిదే అయినా.. అంద‌రి ఫోక‌స్ సంతోష్ మీద‌నే ఉండ‌టం చూస్తే.. పార్టీలో అత‌గాడికున్న స్థానం ఏమిటో ఇప్పుడు అర్థ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌కు సుదీర్ఘ‌కాలం స‌హాయ‌కుడిగా ఉన్న సంతోష్ కుమార్ ను ఇప్ప‌టికే త‌మ మీడియా సంస్థ‌ల్లో కీ రోల్ ఇచ్చిన కేసీఆర్‌.. తాజాగా రాజ్య‌స‌భ‌కు పంప‌టం ద్వారా త‌న‌కు చేసిన సేవ‌కు వ‌డ్డీతో స‌హా బ‌దులు తీర్చుకున్నార‌ని చెప్పాలి.

ఈ కార‌ణంతోనే కావొచ్చు.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన అనంత‌రం సంతోష్ కుమార్ మాట్లాడుతూ..  త‌న‌పై న‌మ్మ‌కంతో సీఎం కేసీఆర్ అప్పగించిన క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తాన‌ని.. ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని వ్యాఖ్యానించారు. పార్టీలో సంతోష్‌కున్న స్థానం ఏమిటో తాజాగా ఈ రోజు పత్రిక‌ల్లో ప్ర‌ముఖంగా  ప్రింట్ అయిన ప్ర‌క‌ట‌న‌లు విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తాయ‌ని చెప్పాలి.
Tags:    

Similar News