ఎన్నికల్లో కారు జోరు ఎంతో చెప్పేసిన ఏకగ్రీవాలు

Update: 2020-01-15 05:44 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ కారు దూసుకెళుతోంది. మంగళవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. పోటాపోటీగా ఉంటుందని ప్రతిపక్షాలు చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న ధీమాను ప్రదర్శిస్తున్న గులాబీ బాస్ అంచనాలకు తగ్గట్లే.. ఏకగ్రీవాలు ఉండటం గమనార్హం.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత చూస్తే.. అత్యధిక ఏకగ్రీవాలు టీఆర్ఎస్ పార్టీకే సొంతం కావటం విశేసం. ఎలాంటి పోటీ లేకుండా 76 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మూడు వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో.. ఈ నెల 22న ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ తన జోరును ప్రదర్శిస్తోందని చెప్పాలి.

అంతేకాదు.. పరకాల మున్సిపాలిటీలోని సగం సీట్లను ఏకగ్రీవం కావటం.. అవన్నీ టీఆర్ఎస్ వే కావటం మరో ఆసక్తికర అంశంగా చెబుతున్నారు. మొత్తం 22 వార్డుల్లో 11 వార్డుల్లో ఎవరూ బరిలో నిలవలేదు. దీంతో.. టీఆర్ఎస్ ఖాతాలోకి ఆ పదకొండు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మరికొన్ని జిల్లాల్లోనూ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలోనూ గులాబీ జెండానే ఎగురుతుందని నమ్మకంగా చెబుతున్న సీఎం కేసీఆర్ మాటలు నిజం కానున్న విషయం తాజాగా తేలిన ఏకగ్రీవాలు చెప్పేశాయి.తాజా పరిణామాలు చూస్తుంటే.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదని చెప్పక తప్పదు.



Tags:    

Similar News