టీఆర్ ఎస్ నాయ‌కుల చెప్పుకోలేని బాధ ఇది

Update: 2017-05-12 06:50 GMT
అధికార టీఆర్‌ ఎస్ పార్టీ నేత‌ల‌ను క‌దిలిస్తే..ఆనందం కంటే ఆవేద‌న ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. పదవులు రాని వారిది ఒక ఆవేదన అయితే, పదవుల్లో ఉన్నవారిది మరో వ్యథ. ప‌ద‌వుల్లో ఉన్న‌వారు త‌మ ప‌వ‌ర్ ప‌నిచేయ‌డం లేద‌ని, చిన్న ప‌నులు కూడా చేసుకోలేకపోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప‌ద‌వులు ఆశిస్తున్న నేతలు అయితే ప్రభుత్వ పదవుల్లో అవకాశం రానివారికి పార్టీ పదవులను కట్టబెడతామని కేసీఆర్‌ చెప్పారు. ఎలాంటి పదవులు ఇస్తారో తెలియదు అంటూ నిర్వేదంలో ప‌డిపోతున్నారు. రెండేళ్ల‌ నుంచి రాష్ట్ర కార్యవర్గం లేదు. పార్టీ అనుబంధ సంఘాల కమిటీల నియామకం జరగలేదు. ఈ సారి నియమిస్తామని చెప్పారు. ఎప్పుడు చేస్తారో తెలియదు అంటూ ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను గట్టిగా అడగలేని పరిస్థితి ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. పెద్దాయన నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాం అని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతుందని గత ఏడాదికాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. దసరా - దీపావళి - సంక్రాంతి - ఉగాది పండుగలు వెళ్లిపోయాయి. ఎప్పుడు ఉంటుందో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని మంత్రిపదవి ఆశిస్తున్న ఆశాజీవులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వచీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ - ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్‌ - జలగం వెంకట్రావు - రసమయి బాలకిషన్‌ - కొండా సురేఖ - రవీందర్‌ రెడ్డి - శాసనమండలి చైర్మెన్‌ స్వామిగౌడ్‌ వంటివారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొప్పుల ఈశ్వర్‌ మంత్రి పదవి వస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో క్యాబినెట్‌ సెక్రెటరీ పోస్టులు కూడా పోవడంతో శ్రీనివాస్‌ గౌడ్‌ - జలగం వెంకట్రావు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పార్టీ మారినా ఇంకా పదవి దక్కలేదని ఆవేదనలో ఎర్రబెల్లి దయాకరరావు - గుత్తా సుఖేందర్‌ రెడ్డి వంటివారు ఉన్నారు. జూన్‌ రెండుకు ముందు మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరగడంతో నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. నెలరోజులు ఆలస్యమైన ఏమీ కాదు అని, మంత్రివర్గంలో తీసుకుంటే చాలునని చెప్పుకోవడం విశేషం. ఈ సారి మహిళకు అవకాశం కల్పించడం ఖాయమని కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News