రెండు రౌండ్లు ఉండగానే 50వేల మార్క్ దాటింది

Update: 2016-02-16 06:26 GMT
అనుకున్నదే జరిగింది. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి స్పష్టమైన అధిక్యతతో దూసుకెళుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లోనే స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించారు. తెలంగాణ అధికారపక్షానికి సానుకూల వాతావరణం ఉండటం.. తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని ఖేడ్ ఉప ఎన్నికకు అన్నితానై వ్యవహరించటం తెలిసిందే.

ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దూసుకెళుతున్న టీఆర్ఎస్ కు బ్రేకులు వేయాలన్న భావనతో ఉన్న విపక్ష నేతలు ఎంతగా ప్రయత్నించినా.. ఖేడ్ ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలంగానే మారింది. టీఆర్ఎస్ విజయం మీద ఎవరికి ఎలాంటి సందేహాలు లేనప్పటికీ.. మెజార్టీ  మీదనే అందరి దృష్టి ఉంది. ఖేడ్ లో తమ అభ్యర్థికి 50వేల మెజార్టీ పక్కా అని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన మాట ఎంతవరకు నెగ్గుతుందన్న ఆసక్తి ఉంది. అయితే.. హరీశ్ మాటకు తగ్గట్లే ఉప ఎన్నిక ఫలితాలు ఉన్నాయి.

మొత్తం 21 రౌండ్ల ఓట్ల లెక్కింపులో.. హరీశ్ చెప్పిన 50 వేల మార్క్ ను 19 రౌండ్ పూర్తయ్యే నాటికి దాటేయటం గమనార్హం. పోలింగ్ ముగియటానికి రెండు రౌండ్లు మిగిలిన సమయానికే టీఆర్ఎస్ అభ్యర్థి 51వేల మెజార్టీతో నిలవటం గమనార్హం. ఇక.. ఓట్ల లెక్కింపు ముగిసేనాటికి 53వేల అధిక్యంతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తానికి ఖేడ్ ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్ జోస్యమే నిజమైంది.
Tags:    

Similar News