కేసీఆర్....ఒక్క మగాడు

Update: 2016-05-19 05:42 GMT
ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ న‌డిపిస్తున్న‌ బ‌క్కోడిని..న‌ల్లిని న‌లిపిన‌ట్లు న‌లిపేద్దాం అనుకున్నారు. కానీ తెలంగాణ సాధించిన‌. సాధించిన తెలంగాణ‌ను బంగారు తెలంగాణ‌గా తీర్చిదిద్దుత. టీఆర్ఎస్ ఇన్నాళ్లు ఉద్య‌మ పార్టీ. ఇక‌నుంచి రాజ‌కీయ‌పార్టీగా ఎదిగేందుకు కృషి చేస్తా- గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీఎం పీఠం ఎక్కిన త‌ర్వాత త‌ర‌చుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న ఇది. అందుకు త‌గిన‌ట్లుగానే ఆయ‌న అడుగులు ప‌డుతున్నాయి. కారు జోరుతో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌ను కేసీఆర్ కుదేలు చేస్తున్నారు. తాజా ప‌రిస్థితిని చూస్తే....పాలేరులో కారు దూసుకెళ్తోంది. టీఆర్ ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తున్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 23,150 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుండ‌టం చూస్తుంటే.....కేసీఆర్‌ ఒక్క‌మ‌గాడుగా నిరూపించుకుంటున్నాడు.

ఎన్నిక ఏద‌యినా గెలుపు టీఆర్ ఎస్‌ దే! రెండు స్థానాల్లో గెలిచి సీఎం అయిన త‌ర్వాత‌ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో వ‌చ్చిన మెద‌క్ పార్ల‌మెంటు కావ‌చ్చు, త‌న ఆలోచ‌న‌ల ప్ర‌కారం డిప్యూటీ సీఎంను మార్చ‌డం ద్వారా తెచ్చిపెట్టిన వ‌రంగ‌ల్ లోక్‌స‌భ ఉప ఎన్నిక కావ‌చ్చు. నారాయ‌ణ‌పేట్ - పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిప‌డిన ఉప ఎన్నిక కావ‌చ్చు. విజ‌యం టీఆర్ ఎస్‌ దే. ప్ర‌తిప‌క్షాలు ఉమ్మ‌డిగా అభ్య‌ర్థిగా నిల‌బెట్టినా, సీనియ‌ర్ ఎమ్మెల్యే అక‌స్మిక మ‌ర‌ణం అంటూ సెంటిమెంట్ జ‌పం ప‌ఠించినా, సీమాంధ్రుల‌పై ఉద్య‌మ‌కాలంలో కేసీఆర్ అవాకులు చెవాకులు పేలార‌ని గ‌తం గుర్తు చేసినా....ఓట‌ర్లు కారుకు ఓటేస్తున్నారు. తెలంగాణ న‌వ నిర్మాణం కేసీఆర్‌ తోనే సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.

టీఆర్ఎస్ వ‌రుస‌, బంప‌ర్ విజ‌యాల‌ను గ‌మ‌నించిన వారికి స్ప‌ష్టంగా తెలుస్తున్న‌ది ఏంటంటే...కేసీఆర్‌ లో వ‌చ్చిన మార్పేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ మాట‌తీరును చూసి ఆయ‌న్ను "అండ‌ర్ ఎస్టిమేట్‌" చేసిన వారే ఆయ‌న సీఎం ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వేస్తున్న వ్యూహాత్మ‌క అడుగుల‌ను చూసి ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. ఒక‌వైపు పార్టీని బ‌లోపేతం చేసేందుకు చేరిక‌లు, మ‌రోవైపు అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, ఇంకోవైపు సామాన్యుల క‌నీస అవ‌స‌రాలైన తాగునీరు - రోడ్లు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వ‌డం, వీట‌న్నింటికీ తోడుగా సామాజిక అంశాలైన‌ ప‌చ్చ‌ద‌నం - స్వ‌చ్ఛ‌త - చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం వంటివి కేసీఆర్ పాల‌న‌పై ఫీల్ గుడ్ భావ‌న క‌లిగేందుకు కార‌ణంగా మారాయి. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వెనుక‌ అవినీతి ఎత్తుగ‌డ ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా, ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోతున్నారన్నా, ఇచ్చిన మాట‌ను పూర్తిస్థాయిలో నిల‌బెట్టుకోర‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నా...కేసీఆర్ వ్యూహాల ముందు అవ‌న్నీ చిత్త‌వుతున్నాయి. ప్ర‌జ‌లు మంచిని మాత్ర‌మే చూసే స్థాయిలో కేసీఆర్ వేస్తున్న పాచిక‌లు ఫ‌లిస్తున్నాయి. అందుకే ఇప్పుడు గులాబీ ద‌ళ‌ప‌తి గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే...కేసీఆర్ ఒక్క‌మగాడు. మొత్తానికి అన్ని పార్టీలు ఏక‌మై ఎన్ని వ్యూహాలు ప‌న్నినా అంద‌రినీ ఎదిరించి ఒక్క‌మగాడిగా కేసీఆర్ నిలిచారు.
Tags:    

Similar News