టీఆర్ఎస్ తెలివే తెలివి.. రాహుల్ సభను ‘జాకెట్’ కప్పేశారుగా?

Update: 2022-05-07 05:30 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. రాజకీయ వ్యూహాల్ని అమలు చేయటంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. మిగిలిన రాజకీయ పార్టీలు ఆలోచించే దానికి మించి ఒకట్రెండు అడుగులు ముందుగా ఉండటమే గులాబీ పార్టీ గుబాళింపునకు కారణంగా చెప్పాలి.

నిజానికి ఈ తీరు ఇప్పటిది కాదు.. తెలంగాణ ఉద్యమం నాటి నుంచే అమలు చేసేది. బాగా గుర్తు తెచ్చుకుంటే.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ కానీ.. విపక్ష తెలుగుదేశం కానీ ఏదైనా భారీ కార్యక్రమాన్ని చేపట్టిన సమయంలోనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టటం లేదంటే.. సంచలన వ్యాఖ్య చేయటం.. లేదంటే కీలకమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటించటం లాంటివి చేసేవారు.

ఇదంతా కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల కార్యక్రమాల ప్రయారిటీలో కాస్త మార్పులు వచ్చేలా.. ఆ స్పేస్ ను తాము సొంతం చేసుకునేలా చేసేవారు. ఇలాంటివి ఐడియాలో గులాబీ బాస్ కేసీఆర్ దగ్గర బోలెడన్ని ఉంటాయని చెబుతారు. అప్పట్లోనే అన్ని ఐడియాలు ఉన్నప్పుడు.. అధికారపక్షంగా.. తెలంగాణలో తిరుగులేని అధికారపక్షంగా వ్యవహరిస్తున్న ఇప్పుడు ఎందుకు ఉండవు చెప్పండి. ఇవాల్టి దినపత్రికల్ని నిశితంగా చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

నిన్న (శనివారం) వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన  రైతు సంఘర్షణ సభ సక్సెస్ కావటమే కాదు.. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రసంగం హైలెట్ అయ్యిందన్నది మర్చిపోకూడదు. మరి.. అలా హైలెట్ అయిన కార్యక్రమాన్ని అన్ని దినపత్రికలు తమ మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించటం ఖాయం. అలాంటి వాటిని పెద్దగా ఇష్టపడని టీఆర్ఎస్.. అందుకు తనదైన ప్లాన్ వేసిందని చెప్పాలి.

ఇవాల్టి రోజున దినపత్రికల్ని అమ్మే స్టాండ్ ను చూస్తే.. ప్రతి పేపర్ అయితే మంత్రి కేటీఆర్ నిలువెత్తు ఫోటో ఉన్న జాకెట్ యాడ్ కనిపించటమో లేదంటే.. మరే ఇతర సంస్థలకు చెందిన జాకెట్ యాడ్ ఉండటమో కనిపిస్తుంది. నిజానికి మంత్రిగా కేటీఆర్ జిల్లాకు వెళ్లటం అరుదైన విషయం కాదు. అలా వెళ్లిన సందర్భంగా దినపత్రిక మొదటి పేజీ మొత్తాన్ని యాడ్ రూపంలో కప్పేయటం వ్యూహంలో భాగమేతప్పించి మరొకటి కాదంటున్నారు.

ఈ రోజు శనివారం కావటంతో కొన్ని దినపత్రికలకు తప్పనిసరిగా జాకెట్ యాడ్ ను ఏదో ఒక ప్రముఖ సంస్థ ఇస్తుంటుంది. అలా ఇవ్వని దినపత్రికల్నిటీఆర్ఎస్ కవర్ చేయటం ద్వారా.. తక్కువ ఖర్చుతో పత్రిక మొదటి పేజీని కనిపించకుండా జాకెట్ యాడ్ తో అడ్డుకున్న తెలివిని చూస్తే.. ఇలాంటివి టీఆర్ఎస్ కు వచ్చినంత బాగా మరెవరికి రాదనే చెప్పాలి. టీఆర్ఎస్సా మజాకానా?
Tags:    

Similar News