రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు..కేసీఆర్ మార్క్ స‌స్పెన్స్‌

Update: 2018-03-11 06:42 GMT
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక టీఆర్ ఎస్‌ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్ర‌స్తుతం ఖాళీ అయిన 3 స్థానాల్లో రెండింటిని టీఆర్ ఎస్‌ సునాయాసంగా గెలుచుకోనుంది. మరో సీటును ఎంఐఎం మద్దతుతో కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ ఎస్‌ ఎల్పీ భేటీకానుంది. సమావేశం అనంతరం ముగ్గురు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే రాజ్యసభ సభ్యుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారని స‌మాచారం. అయితే ఆ పేర్ల విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది.

రాజ్యసభకు తెలంగాణలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు సీట్లలో సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలో మూడు వేర్వేరు సామాజిక వర్గాల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆలోచించారు. రాజ్యసభ బెర్తు కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. చివరగా పేర్లన్నీ పరిశీలించిన సీఎం.. ముగ్గురి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే టీఆర్ ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఉద్య‌మ‌కాలం నుంచి త‌న వెన్నంటి ఉన్న స‌న్నిహిత బంధువు సంతోష్ కుమార్‌ పేరు ఖరారైంది. మరో స్థానాన్ని యాదవులకు ఇస్తామని ఇదివరకే సీఎం తెలిపారు. యాదవుల్లో ఈ సారి దక్షిణ తెలంగాణ నుంచి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. జైపాల్ యాదవ్ - నోముల నర్సింహయ్య - శ్రీనివాస్ యాదవ్ - మురళీ యాదవ్ - లింగయ్య యాదవ్ - ఎంబీ కృష్ణ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలించారు. వీరిలో జైపాల్ యాదవ్‌ కు సానుకూలత ఉన్నట్లు తెలిసింది.

అయితే మూడో స్థానం విష‌యంలోనే ఉత్కంఠ కొన‌సాగుతోంది. మూడో స్థానాన్ని మైనార్టీలకు లేదంటే ముదిరాజ్ వర్గానికి ఇవ్వాలనే యోచతో సీఎం కేసీఆర్ ఉన్నారని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. హైదరాబాద్‌లోని మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధినేతతో పాటు మరికొందరు పేర్లను పరిశీలించారు. ముదిరాజ్ వర్గ నాయకుల వివరాలనూ పరిశీలించారు. మూడో స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ఇవాళ తేలనుంది. టీఆర్ ఎస్ ఎల్పీ స‌మావేశంలో ఈ పేర్లు ప్ర‌క‌టించ‌నున్నారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కాగా, అదే రోజు అసెంబ్లీ కూడా ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో నామినేష‌న్ వేయాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
Tags:    

Similar News