ఆర్టీసీ సమ్మెపై గులాబీ దళంలో భయమిదే..!

Update: 2019-10-26 08:35 GMT
ఆర్టీసీ సమ్మె త్వరగా ముగియాలని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారట.. సమ్మెతో తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. వ్యతిరేకత హుజూర్ నగర్ లో ప్రభావం చూపిస్తాయని గులాబీ దళమంతా కంగారుపడింది. కానీ ఏకంగా 40వేలకు పైగా మెజార్టీతో టీఆర్ ఎస్ గెలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసీఆర్ బయటకొచ్చి ఘీంకరించాడు. హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభకు కూడా తరలివెళ్తున్నాడు.

అయితే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ ఆర్టీసీ సమ్మె త్వరగానే ముగియాలని దేవుడిని వేడుకుంటున్నారట.. ఎందుకంటే వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.. అవి ఎమ్మెల్యేలకు పరీక్షగా మారిపోయాయి.  పట్టణ ప్రాంతంలోనే దాదాపు 97 ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోలో కనీసం 500 మంది ఉద్యోగులున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే ఎంతలేదన్నా 1200 మంది ఉంటారు.  వారంతా వార్డుల్లో క్రియాశీలకంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఆయా వార్డుల్లో ఆర్టీసీ కార్మిక కుటుంబాలు టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే చాన్స్ ఉంది. ప్రచారాన్ని అడ్డుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆర్టీసీ సమ్మె హుజూర్ నగర్ పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా రాబోయే పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని గులాబీ ఎమ్మెల్యేలు కంగారుపడుతున్నారట..

ఇక ఇప్పటికే 20 రోజులకు పైగా నడుస్తున్న ఆర్టీసీ సమ్మె కారణంగా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులపై ఎక్కువగా ఆధారపడే పట్టణ జనాభా తీవ్రంగా నష్టపోతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు ఇద్దరూ కఠినమైన వైఖరితో ముందుకెళుతుండడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఎదురై అది ప్రభుత్వంపై  వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉందని వారంతా భయపడుతున్నారట..

ప్రభుత్వం ఈ ప్రతిష్టంభనను తొలగించి ఆర్టీసీ సమ్మెను పరిష్కరించి ఎంత వీలైతే అంత త్వరగా ముగింపు పలికితేనే మున్సిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయని గులాబీ శ్రేణులు అంచనావేస్తున్నారు. సమ్మె జరిగితే బలమైన ప్రతిపక్షాలున్న కరీంనగర్, రామగుండం, వరంగల్ కార్పొరేషన్ లో గులాబీ పార్టీకి పెద్ద దెబ్బ పడొచ్చని ఆందోళన చెందుతున్నారు.
   

Tags:    

Similar News