మూడు రాజ్య‌స‌భ స్థానాలు కారుకే...

Update: 2018-03-21 04:54 GMT
తెలంగాణ రాష్ట్రం నుంచి ఈనెల 23న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం ఖ‌రారైపోయింద‌ని అంటున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేల ఓట్ల‌తో మూడో సీటు గెలుచుకోనున్న‌ప్ప‌టికీ ఆ ఎమ్మెల్యేల‌కు విప్ వ‌ర్తించ‌క‌పోవ‌డంతో గులాబీ టీం ఖుషీలో ఉంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఓటు వేసిన‌ప్ప‌టికీ అన‌ర్హ‌త‌కు గురయ్యే అవ‌కాశం త‌క్కువ ఉండ‌ట‌మే కారణం. రాజ్యసభ ఎన్నికలు ఒపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. అలాగే పార్టీలు తమ సభ్యులకు విప్ జారీచేసే అధికారం ఉండదని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.

రాజ్య‌స‌భ ఎన్నిక సంద‌ర్భంగా పోలింగ్ కేంద్రంలో పార్టీల వారీగా కూర్చునే ఏజెంట్లకు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికి ఓటువేస్తున్నారో చూపించాలని అడిగే అధికారం ఉంటుంది. ఒకవేళ పార్టీ సూచించిన అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ఓటువేసిన ఎమ్మెల్యేలపై - ఓటింగ్‌ కు రానటువంటి సభ్యులపై సదరు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎమ్మెల్యేలకు పార్టీల ఫిరాయింపు చట్టం వర్తించదని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో అధికారపార్టీ టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమైపోయింద‌ని అంటున్నారు.

ఇక సంఖ్యాప‌రంగా చూసినా ప్రస్తుతం శాసనసభలోని పార్టీ బలాబలాల ఈ మూడు స్థానాలు కూడా టీఆర్ ఎస్ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఏడుగురు సభ్యులు కలిగిన మజ్లిస్ పార్టీ ఇప్పటికే ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 30ఓట్లు చొప్పున ముగ్గురు అభ్యర్థులు గెలువాలంటే మొత్తం 90 ఓట్లు అవసరమవుతాయి. టీఆర్ ఎస్‌ కు ఆ బలం ఉండటంతో తొలి ప్రాధాన్య ఓటుతోనే టీఆర్ ఎస్ అభ్యర్థులు గెలువనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా బరి లో దిగిన బలరాంనాయక్‌ కు ఇప్పటికే చాలినంత బలం లేకపోగా ఉన్నవాళ్లలో ఇద్దరు సభ్యుల మద్ధతు తగ్గింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేశారు. దీంతో సభలో కాంగ్రెస్ బలం మరింత తగ్గి అభ్యర్థి విజయం అసాధ్యమైంది. కాంగ్రెస్ సభ్యులతోపాటు - బీజేపీ - టీడీపీ - సీపీఎం సభ్యులందరు కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినా కూడా తొలి ప్రాధాన్యతలో బలరాం నాయక్‌ కు 30 ఓట్లు వచ్చే అవకాశం లేదు.

మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం తెలంగాణభవన్‌ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల మాక్ పోలింగ్‌ లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓటు వేశారు. ఇందుకోసం నమూనా బ్యాలెట్ పేపర్ - బ్యాలెట్ బాక్స్‌ ను రూపొందించారు. ఓటు ఎలా వేయాలనే దానిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలకు వివరించారు. ఎలాంటి అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంగ్లిషు నంబర్ 1ను వేయాలని సూచించారు. బుధ - గురువారాల్లో అసెంబ్లీ అవరణలోని టీఆర్ ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కు - నల్లగొండ - రంగారెడ్డి - మహబూబ్‌ నగర్ - హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను బడుగుల లింగయ్య యాదవ్‌ కు - వరంగల్ - ఖమ్మం - మెదక్ - హైదరాబాద్ జిల్లాలోని కొందరిని బండ ప్రకాశ్‌ కు కేటాయించారు.

ఒక్కో అభ్యర్థికి 32 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఒకరికి మాత్రం 33మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఒక్కో అభ్యర్థికి సంబంధించి ఇద్దరు మంత్రులకు ప్రధానంగా బాధ్యతలు అప్పగించారు. జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ఎన్నికను సమన్వయం చేయడానికి రాష్ట్ర మంత్రు లు కేటీఆర్ - ఈటల రాజేందర్ - బండ ప్రకాశ్‌ కు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి - మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు - బడుగుల లింగయ్య యాదవ్‌ కు మంత్రులు టీ హరీశ్‌ రావు - జీ జగదీశ్‌ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.
Tags:    

Similar News