ఈ పెద్దాయన సంగతి కేసీఆర్ ఎందుకు తేల్చటం లేదు?

Update: 2021-07-17 04:17 GMT
కాలం కలిసి రాకపోతే ఎలాంటోల్లు మరెలా అవుతారన్న దానికి నిదర్శనంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హవా ఒక రేంజ్లో నడిచిందనే చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పటం మొదలు పెట్టిన తర్వాత డీఎస్ జోరు కాస్త తగ్గినప్పటికీ.. ఆయన విలువ.. ప్రాధాన్యత తగ్గలేదు.

అలాంటి ఆయన ఇప్పుడు అటుఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. తెలంగాణ అధికారపక్ష నేతగా ఉన్నట్లు చెబుతున్నా.. తాను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం తనకే అర్థం కానట్లుగా ఉందన్న ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నానన్న విషయాన్ని టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే అడగాలంటూ ఆయన బదులిచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పేరుకు టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ.. ఆయన అధినేత కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరిగినప్పటికీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. పార్టీలోకి చేర్చుకునే సమయంలో కేసీఆర్ తనకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్న కోపం డీఎస్ కు ఉందని చెబుతారు.

అందుకే.. ఆయన పార్టీకి దూరంగా ఉంటూ.. తనకు అవకాశం చిక్కిన ప్రతిసారీ కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది.

తాను ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న విషయాన్ని ఆయన తనదైన శైలిలో వెల్లడించిన హాట్ టాపిక్ గా మారారు. తాను టీఆర్ఎస్ లో ఉంటే కేసీఆరే చెప్పాలన్న ఆయన.. తన మంచి చెడ్డల గురించి అడిగే వారే పార్టీలో ఎవరూ లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఒకరు కాంగ్రెస్ లో ఉంటే.. మరొకరు బీజేపీలో ఉన్నారని.. తాను మాత్రం ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలీదన్న డీఎస్ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ తరహా వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందిస్తారా? లేదంటే.. ఎప్పటిలా మౌనంగా.. తన వరకు ఏ విషయం రాలేదన్నట్లుగా ఉండిపోతారో చూడాలి. ఏమైనా.. తనను విమర్శించే వారి విషయంలో తొందరపాటు పడకుండా కాలానికే వదిలేసే ఆయన తీరుపైనా ఆసక్తికర చర్చ సాగుతూ ఉంటుంది.


Tags:    

Similar News