రాహుల్ కు టీఆర్ఎస్ వైట్ చాలెంజ్.. బ్యానర్లతో హీట్

Update: 2022-05-05 09:06 GMT
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన 'వైట్ చాలెంజ్'నే ఆయుధంగా మలిచి దీన్నే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విసురుతోంది అధికార టీఆర్ఎస్. ఈ మేరకు రాహుల్ రాక సందర్భంగా హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాహుల్ జీ.. వైట్ చాలెంజ్ కు సిద్ధమా? అని నగరంలో ఎక్కడ చూసినా ఈ బ్యానర్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సవాల్ విసురుతున్న ఈ పోస్టర్లు సంచలనమయ్యాయి.  ఇవి టీఆర్ఎస్ శ్రేణులే వేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

శుక్రవారం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ బ్యానర్లు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. రాహుల్ జీ.. వైట్ చాలెంజ్ కు సిద్ధమా? అన్న ప్రశ్న ఆ బ్యానర్లలో ఉంది. గన్ పార్క్, ట్యాంక్ బండ్ దగ్గర ఈ బ్యానర్లు వెలిశాయి.

ఈ వైట్ చాలెంజ్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఆధ్యుడు. గతంలో డ్రగ్స్ విషయంలో అనేకసార్లు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఈ చాలెంజ్ విసిరారు. కేటీఆర్ కు సవాల్ చేశారు. కేటీఆర్ వైట్ చాలెంజ్ కు సిద్ధమా? అంటూ పెద్ద ఉద్యమానే చేశారు.

దీనికి 'నేను సిద్ధమే.. రాహుల్ గాంధీ కూడా సిద్ధమా?' అంటూ రివర్స్ చాలెంజ్ విసిరాడు కేటీఆర్. ఆ తర్వాత సద్దుమణిగిన ఈ వైట్ చాలెంజ్ గొడవ ఇప్పుడు నేపాల్ లోని నైట్ క్లబ్ లో రాహుల్ కనిపించడంతో మరోసారి తెరపైకి వచ్చింది.

ఆ ఫొటోలతో బ్యానర్లు ప్రింట్ చేసిన కొందరు 'రాహుల్ గాంధీ వైట్ చాలెంజ్ కు సిద్ధమా?' అంటూ చాలెంజ్ లు విసురుతున్నారు. వైట్ చాలెంజ్ లో పాల్గొనాలంటూ రాహుల్ కు కనిపించేలా పోస్టర్లు అంటిస్తున్నారు. బ్యానర్లు వెలుస్తున్నాయి.

ఇక టీఆర్ఎస్ నేతలు కూడా సోషల్ మీడియాలో ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మా మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు.. మీరు సిద్ధమేనా? అన్న ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రేవంత్ చేసిన ట్వీట్లను మళ్లీ షేర్ చేస్తూ రాహుల్ ను టీఆర్ఎస్ కేడర్ ప్రశ్నిస్తోంది.
Tags:    

Similar News