సెంచ‌రీ కొట్టేస్తామంటున్న కేటీఆర్‌

Update: 2018-08-25 12:23 GMT
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ గెలుపుపై అనూహ్య‌మైన ధీమాతో ఉంది. గులాబీ ద‌ళ‌ప‌తి - టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుడు కేసీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ముంద‌స్తుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. టీఆర్ ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో వంద శాతం సెంచరీ కొట్టబోతున్నదని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. దేశంలో మోడీ మొదలుకొని రాహుల్ వరకు అందరికీ ఈ విషయం తెలుసునన్నారు. టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్రగతి నివేదన సభ నేపథ్యంలో జలవిహార్‌ లో హైదరాబాద్ జిల్లా టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు - కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

ఎవరూ ఊహించని పథకాలు - మరెవరూ ఆలోచించని అసాధారణమైన నిర్ణయాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమాన్ని - అభివృద్ధిని మేళవించి సబ్బండ వర్గాలు సంబురపడేలా పాలనను అందిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తన కుటుంబం నుంచే నలుగురైదుగురు వచ్చిన రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తుందనడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. రాహుల్ వెనుక గాంధీ అనేది లేకపోతే అసలు లీడరే అయ్యేవాడు కాదని, హైదరాబాద్‌ లో కార్పొరేటర్‌ గా కూడా గెలువలేడని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో రానున్న ఎన్నికల్లో ఒక్కరూ గెలవరని చెప్పారు. కాంగ్రెస్‌ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో ఈ నాలుగేండ్లలో మతకలహాలుగానీ - కర్ఫ్యూ వంటివిగానీ ఒక్కటీ జరుగలేదని రొమ్ము విరుచుకుని సగర్వంగా చెప్పుకొనే స్థితిలో ఉన్నామన్నారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా కేసీఆర్ వైపు నిలబడ్డారని గుర్తుచేశారు.

ప్రగతి నివేదన సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 20 - 30వేల మందిని తరలించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశం మొత్తానికి అద్భుతమైన సందేశం ఇచ్చేలా నివేదన సభను నిర్వహించుకుందామన్నారు. ‘ఆరు నెలలో - మూడు నెలలో.. ఎప్పుడో ఓసారి ఎన్నికలు రాక తప్పదు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.. అందుకే ప్రగతి నివేదన సభ. ఈ సభ తొలిసారిగా నగర శివారులో జరుగుతున్న నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలి` అని కోరారు.
Tags:    

Similar News