కేంద్రంలో ఆ మూడు పార్టీలే కీల‌కం...

Update: 2019-01-25 05:04 GMT
రానున్న ఎన్నిక్ల‌లో భారతీయ జ‌న‌తా పార్టీ అయినా.... కాంగ్రెస్ అయినా... మ‌రే పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ముచ్చ‌ట‌గా మూడు పార్టీలే కీల‌కం కానున్నాయి. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర స‌మితి - వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీల విజ‌య‌మే కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉండాలో నిర్ణ‌యిస్తుంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీల‌కు తోడుగా ముచ్చ‌టగా మూడో పార్టీ అయిన ఒడిషాలో అధికారంలో ఉన్న బీజేడీ కూడా అత్యంత కీల‌క‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.  జాతీయ మీడియాలో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న ఇండియా టుడే - రిప‌బ్లిక్ చానెల్ ఒకేసారి నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఈసారి అధికారం తిరిగి రావాలంటే మాత్రం మ‌రొక‌రి సాయం అత్య‌వ‌స‌ర‌మ‌ని ఈ ఛానెళ్లు నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది.వీటిల్లో  రిపబ్లిక్ టీవీ చేసిన స‌ర్వే ప‌మ‌గ్రంగా ఉండ‌డం విశేషం. వీరు రాష్ట్రాల వారీగా - పార్టీల వారీగా స‌ర్వే చేయ‌డంతో ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే ఈ ఛానెల్ లాగే స‌ర్వే చేసిన ఇండియాటుడే స‌ర్వే మాత్రం కాసింత గంద‌ర‌గోళంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇండియా టుడే చేసిన స‌ర్వేలో కాంగ్రెస్ పార్టీకి 97 స్ధానాలు - భార‌తీయ జ‌న‌తా పార్టీకి 202 స్ధానాలు వ‌స్తాయ‌ని తేల్చారు. దేశంలో మిగిలిన అన్ని పార్టీల‌కు క‌లిపి 147 స్ధానాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. ఈ ఇత‌రుల లెక్క‌లో ఎవ‌రున్నారో ఇండియా టుడే స్ప‌ష్టంగా ప్ర‌క‌టించక‌పోయినా వాటిలో మాత్రం ప్రాంతీయ పార్టీ లైన వైఎస్ ఆర్ కాంగ్రెస్  - టీఆర్ ఎస్ - అన్నాడీఎంకే - ఎస్పీ - బీఎస్పీ - టీఎంసీ - బీజేడీ వంటి పార్టీలే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.  రిప‌బ్లిక్ టీవీ చేసిన స‌ర్వేలో ఎన్డీయే కూటమి పార్టీలు 233 - యూపీఏ కూటమి పార్టీలు 167 సీట్లను సాధించే అవకాశం ఉందని  అంచనా.  ఇక దేశంలోని ఇత‌ర పార్టీల ప‌రిస్థితి మ‌రోలా ఉంది. రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే ప్ర‌కారం ఎస్పీ - బీఎస్పీలు యాభై ఒక్క సీట్లు - తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క ఎంపీ సీట్లను సాధించవచ్చని  సర్వే తేల్చారు. జేడీఎస్ - డీఎంకేలు తెలుగుదేశం పార్టీలు యూపీఏలో భాగ‌స్వామ్య పార్టీలే అయినా వారికి వ‌చ్చే స్థానాలు మాత్రం త‌క్కువే అని తేల్చారు.. ఇక త‌మిళ‌నాడులోని అన్నాడీఎంకే  ఒక్క సీటు కూడా గెలుచుకోలేద‌ని ఈ సర్వేలో  తేల్చారు. ఇక మిగిలిన పార్టీలైన టీఆర్ ఎస్ -  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  - బీజేడీ పార్టీలు కీలకం అయ్యే అవకాశం ఉంది. ఈ పార్టీల‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితికికి పదహారు ఎంపీ సీట్లు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎంపీ సీట్లు - బీజేడీకి వ‌చ్చే మ‌రికొన్ని స్థానాలే  కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో  ఈ పార్టీలు ఎటు వైపు ఉంటే వారే అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పేది తెలుగు రాష్ట్రాలే కావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News