జేసీకి షాకిచ్చిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌

Update: 2017-07-09 06:10 GMT
చ‌ట్టం అంద‌రికి స‌మాన‌మే లాంటి మాట‌లు చెబుతారే కానీ.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఉండ‌ద‌న్న‌ది తెలిసిందే. చ‌ట్టం  కొంద‌రి విష‌యంలో ప్రత్యేక మిన‌హాయింపులిస్తున్న‌ట్లుగా వ్య‌వ‌స్థ న‌డుస్తుంటుంది. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని.. చేసిన త‌ప్పుల‌కు త‌ప్ప‌నిస‌రిగా శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌న్న‌ది అక్ష‌ర స‌త్య‌మ‌న్నది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. తానేం చేసినా న‌డిచిపోతుంద‌ని ఫీల‌య్యే నేత‌ల‌కు షాకిచ్చే ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య‌న చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. అనంత‌పురం ఎంపీ.. టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డికి అలాంటి షాకే త‌గిలింది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయ‌న్ను ప్ర‌యాణానికి అనుమ‌తించేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిరాక‌రించారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లేందుకు రెండు సార్లు ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న‌కు ఫ‌లితం లేక‌పోయింది. శ‌నివారం రాత్రి 7.40 గంట‌ల‌కు విజ‌య‌వాడ వెళ్లేందుకు స్పైస్ జెట్ విమానం ఎక్కిన ఎంపీ జేసీని సిబ్బంది వెన‌క్కి పంపేశారు. త‌మ విమానంలో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి లేద‌ని సిబ్బంది స్ప‌ష్టం చేశారు.

తాజాగా ఈ ఉద‌యం ట్రూజెట్ విమానంలో జేసీ విజ‌య‌వాడ‌కు మ‌రోసారి టికెట్ బుక్ చేసుకున్నారు. ఉద‌యం 6.40 గంట‌ల‌కు ఆయ‌న విమానంలో విజ‌య‌వాడ‌కు చేరుకోవాల్సి ఉన్నా.. ఆయ‌న విమానం ఎక్కేందుకు అనుమ‌తిని నిరాక‌రించారు. ట్రూజెట్ మేనేజ‌ర్ జేసీకి ఫోన్ చేసి త‌మ విమానంలో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి లేద‌ని చెప్పి వెన‌క్కి పంపారు.

కొద్ది రోజుల క్రితం (జూన్ 15) విశాఖప‌ట్నం ఎయిర్ పోర్ట్ కు ఆల‌స్యంగా వెళ్లిన జేసీకి బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు విమాన సిబ్బంది అనుమ‌తించ‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన జేసీ.. అక్క‌డి సిబ్బంది ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. అక్క‌డి ప్రింట‌ర్‌ ను కింద ప‌డేశారు. దీంతో.. ఆయ‌న తీరును త‌ప్పు ప‌డుతూ దేశీయ విమాన సంస్థ‌లు ఆయ‌న‌పై నిషేధం విధించాయి. తాజాగా ఆ నిషేధ ప్ర‌భావం జేసీకి నేరుగా ఎదురైంది.
Tags:    

Similar News