ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికన్లకు 24 గంటల్లో వ్యాక్సిన్

Update: 2020-12-12 08:25 GMT
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి.. మిగిలిన దేశాల కంటే కూడా అగ్రరాజ్యమైన అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటివరకు ఏ విపత్తు దెబ్బ తీయనంత దారుణంగా.. ఏ యుద్ధంలో జరగనంత మానవ నష్టాన్ని కంటికి కనిపించని కరోనా కారణంగా అమెరికాకు జరిగిందని చెప్పాలి. కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నా.. వాటి ఫలాలు అమెరికాకు అందలేదు.

ఇప్పటికే రష్యా.. బ్రిటన్.. దుబాయ్ లాంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. కానీ.. అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం వ్యాక్సిన్ పంపిణీ జరగటం లేదు. ఇలాంటివేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రానున్న 24 గంటల్లో కరోనా వ్యాక్సిన్ ను అమెరికన్లకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్.. జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ కు తాజాగా అమెరికా ఆహార.. ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. గురువారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన బహిరంగ చర్చ అనంతరం.. ఇందుకు ఓకే చెప్పారు. వ్యాక్సిన్ డోస్ ను రానున్న 24 గంటల్లో అందుబాటులోకి తేనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. అమెరికన్లందరికి ఫైజర్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం తొమ్మిది నెలల్లో అద్భుతమైన విజయాన్నిసాధించామని.. ఇది నిజంగా శుభవార్తగా ఆయన పేర్కొన్నారు. మొదటి టీకాను ఎవరికి ఇస్తారన్న విషయంపై ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పెద్ద వయస్కులు.. ఆరోగ్య కార్యకర్తలు టీకాలు తీసుకునే వారిలో మొదటివరుసలో ఉంటారని చెప్పారు. మరి.. ఈ వ్యాక్సిన్ ట్రంప్ ఇమేజ్ ను పెంచుతుందా? మరింత డ్యామేజ్ చేస్తుందా? అన్నది చూడాలి.
Tags:    

Similar News