ట్రంప్‌కు బీపీ పెంచేస్తున్న శ‌ర‌ణార్థులు

Update: 2017-09-18 11:56 GMT
శ‌ర‌ణార్థులు....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు అస్స‌లు న‌చ్చ‌ని ప‌దం. వ‌ల‌స‌దారుల‌న‌యినా... డ్రీమ‌ర్స్ పేరుతో అనుమ‌తితో చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రుల వెంట‌ వ‌చ్చిన వారయిన పేరు ప్ర‌స్తావించ‌గానే ట్రంప్ నిప్పులు చెరుగుతుంటారు. అలాంటి ట్రంప్ ఇంట్లోనే ఏకంగా శ‌ర‌ణార్థులు తిష్ట‌వేస్తే..ఊహించ‌లేం క‌దా. కానీ అదే జ‌రిగింది. అచ్చుగా ట్రంప్ ఇంట్లో నే శ‌ర‌ణార్థులు దిగిపోయారు.

అసలు శరణార్థులంటేనే తీవ్రంగా మండిపడుతూ తమ దేశంలోకే అడుగుపెట్టకూడదన్న ట్రంప్...ఏకంగా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమేంటి అన్న అనుమానం మీకు కలగొచ్చు. నిజమే.. ఇది ట్రంప్ చేసిన ఏర్పాటు కాదు. శరణార్థులను వద్దంటున్న ప్రపంచ నేతలకు ఓ సందేశం ఇవ్వడానికి ఆక్స్‌ ఫామ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం ఆస‌క్తిక‌రంగా మారింది. తన చిన్నతనంలో ఉన్న ఇల్లు రెండు రోజుల పాటు శరణార్థులకు ఆశ్రయంగా మారింది. గత శనివారం ఈ ఇంటిని అద్దెకు తీసుకొని నలుగురు శరణార్థులను అందులో ఉంచిందీ సంస్థ. న్యూయార్క్‌లో ఉన్న ఈ మూడంస్థుల మేడను 1940లో నిర్మించారు. ట్రంప్ తన నాలుగో ఏట వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత దీనిని ఆమ్మేశారు. ఓ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి 21.4 లక్షల డాలర్లకు ఈ ఇల్లును కొన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే 725 డాలర్లు చెల్లిస్తే ఒక రోజు ఈ ఇంట్లో ఉండొచ్చు. అలా ఆక్స్‌ ఫామ్ అనే సంస్థ ఈ ఇంటిని అద్దెకు తీసుకొని శరణార్థులను అందులో ఉంచింది.

ఆరు ముస్లిం దేశాల పౌరులతోపాటు శరణార్థులు కూడా అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని శరణార్థులను తాత్కాలికంగా ఉండేందుకు అనుమతిని ఇచ్చింది. ట్రంప్‌ తోపాటు ప్రపంచ నేతలంతా శరణార్థులను ఆదుకోవడానికి ముందుకు రావాలన్న గట్టి సందేశాన్ని తాము ఇవ్వాలనుకొనే ఇలా ట్రంప్ ఇంట్లో వాళ్లను ఉంచినట్లు ఆక్స్‌ఫామ్ అమెరికా డైరెక్టర్ షానన్ స్క్రిబ్‌ నర్ అన్నారు. ఈ ప‌రిణామంపై ట్రంప్ ఎలా రియాక్ట‌వుతారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News