కాలుష్య నియంత్రణలో అగ్రస్థానం అమెరికాదే ..ఆ దేశాల్లో దాన్ని వదిలేశారు : ట్రంప్ !

Update: 2020-07-30 10:50 GMT
నిత్యం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్...తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భారత్‌, చైనా, రష్యా వాయు కాలుష్యాన్ని అదుపులోకి తీసుకు రాలేకపోతున్నాయని ట్రంప్‌ విమర్శలు చేసారు. తమ దేశంలో గాలి నాణ్యతను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి అమెరికా ఎంతో కృషి చేస్తోందని, నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తమ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలోనే నిలబెడతానని ట్రంప్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇతర దేశాలను తొలి స్థానంలో నిలబెట్టామని, ఇప్పుడు అమెరిగా మొదటి స్థానంలో నిలిచింది అని అన్నారు.

ట్రంప్‌ బుధవారం టెక్సాస్ ‌లోని మిడ్‌ ల్యాండ్‌ లో చమురు క్షేత్రం పెర్మియన్‌ బేసిన్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. డెమోక్రాట్లు అమెరికాను నాశనం చేయాలనుకుంటున్నారని తెలిపారు. అలాగే అమెరికన్ల జీవన విధానంపై డెమోక్రాట్లకు గౌరవం లేదని , గత పరిపాలనలో పరిశ్రమలపై పరిమితులను విధించడం ద్వారా లెక్కలేనన్ని అమెరికన్ ఉద్యోగాలు, కర్మాగారాలు, చైనాకు, ఇతర దేశాలకు తరలించాయన్నారు. అధ్యక్షుడిగా తాను బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆ ప్రయత్నాలను అంతం చేశానని ట్రంప్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో అమెరికన్ల జీవన విధానం కంటే మెరుగైనది లేదని చెప్పారు.

తమ దేశ ప్రజలకు మాతృభూమి అన్నా, జాతీయగీతమన్నా, జాతీయ జెండా అన్నా చాలా ఇష్టమని తెలిపారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమెరికాకు ఆర్థిక భారమని… ఒప్పందం నుంచి బయటకు రావడం వల్ల బిలియన్ల డాలర్లు ఆదా అయ్యాయని తెలిపారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని యూఎస్ గత ఏడాది నవంబర్‌లో అధికారికంగా తెలియజేసింది. 2020 నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటపడనుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదిగిందని చెప్పారు.
Tags:    

Similar News