కరోనాతో ట్రంప్ స్నేహితుడు మృతి !

Update: 2020-04-13 16:17 GMT
కరోనా మహమ్మారి విజృంభణతో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి నటులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు సైతం మృత్యువాతపడుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు సైతం కరోనాకు బలయ్యాడు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టాన్లీ చెరా ఆస్పత్రిలో కరోనా కి చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆయన తుదిశ్వాస విడినట్లు ఆదివారం అమెరికా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు 4 ల‌క్షల డాల‌ర్లు విరాళంగా ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషనర్‌ తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గ‌త ఏడాది న్యూయార్క్‌ లో జ‌రిగిన వెట‌రన్స్ డే ప‌రేడ్‌ లోనూ స్టాన్లీని త‌న ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ ప‌రిచ‌యం చేశారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తన స్నేహితుడికి కరోనా సోకిందని చెప్పారు.

అయితే , అయన కరోనా తో పోరాడుతూ ఆయన చనిపోవడంతో ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 5,60,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తో పోరాడి 32,634 కోలుకోగా.. మరో 22,115 మంది చనిపోయారు. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 98 వేలకు పైగా మంది బాధితులున్నారు. అక్కడ ఇప్పటి వరకు 6,400 మంది చనిపోయారు.
Tags:    

Similar News