ప్రచారంలో జోరు పెంచిన ట్రంప్ , బిడెన్ .. ఆ రాష్ట్రాలపైనే దృష్టి !

Update: 2020-10-19 15:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి త్వరలోనే జరగబోతున్నాయి. వచ్చే నెల 3 న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇక గట్టిగా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనితో ప్రచారంలో ట్రంప్ , బిడెన్ జోరు పెంచారు. ఒకరిపై మరొకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించే పనిలో మునిగిపోయారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న ముందస్తు పోలింగ్‌లో భారీగా ఓట్లు నమోదు అవుతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ ఇప్పటికే 27.9 మిలియన్ల ఓట్లు పోలయినట్లు అధికారిక అంచనా. ఈ పరిస్థితి ఎలా ఉన్నా కూడా, ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పుతాయని భావిస్తున్న రాష్ట్రాలపై ట్రంప్‌, బిడెన్‌ వర్గాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ చేతిలో తాను ఓటమి పాలైన కీలక రాష్ట్రం నెవెడాలో తాజాగా పర్యటించిన ట్రంప్‌.. ముందస్తు పోలింగ్ ‌లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తన మద్దతుదారులకు ఓ పిలుపు ఇచ్చారు.

నిన్న, మొన్నటి వరకు నవంబర్ 3న జరిగే పోలింగ్‌లో ఓటేయాలని చెబుతూ వస్తున్న రిపబ్లికన్‌ లు ఇప్పుడు ఇలా మాట మార్చడం వెనుక ముందుజాగ్రత్త చర్యలే కారణమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెవెడా లో ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ .. బిడెన్ అధికారంలోకి వస్తారని, కఠిన మైన లాక్‌ డౌన్‌ లు విధిస్తారని ‌ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. అసలే మాస్కులు సరిగా ధరించని నెవెడా ప్రజల్లోకి ట్రంప్‌ వ్యాఖ్యలు గట్టిగానే పనిచేస్తున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడ ట్రంప్‌ ప్రచారం తర్వాత స్ధానికులు బిడెన్‌ ను బూతులు తిట్టారని తెలిపింది.అలాగే , మరో చోట బిడెన్‌ శాస్త్రవేత్తల మాట వింటాడు. నేను కూడా వారి మాట విని ఉంటే కరోనా సమయంలో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లి ఉండేదని వ్యాఖ్యానించారు.

అయితే ట్రంప్ ‌కు భిన్నంగా బిడెన్‌ మాత్రం మరో కీలక రాష్ట్రం నార్త్‌ కరోలినాలో తాజాగా జరిగిన ఓ ప్రచార సభలో మాట్లాడుతూ అమెరికాలో సాగుతున్న వ్యవస్ధాగత వర్ణవివక్షకు వ్యతిరేకంగా క్రిమినల్‌ జస్టిస్ ‌లో సంస్కరణలు తీసుకురావాలని, నల్ల జాతీయుల కోసం ప్రత్యేకంగా ఆర్ధిక వనరులు సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం తమకు కరోనా లక్షణాలున్నప్పటికీ పట్టించుకోకుండా ఇద్దరు అభ్యర్ధులు ట్రంప్‌, బిడెన్‌ ప్రచారంలో పాల్గొంటుండటం కలవరం రేపుతోంది. వీరు ప్రధానంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ద, కరోనా వైరస్‌, పన్నులు, లాక్‌ డౌన్‌ వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చైనాతో సంబంధాలను కూడా ట్రంప్‌ ఎక్కువగా తెరపైకి తెస్తున్నారు. అయితే ఎవరి వాదనను ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారని మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
Tags:    

Similar News