హాట్ టాపిక్ గా ట్రంప్ అల్లుడి ఓట‌రుకార్డు

Update: 2017-09-29 05:53 GMT
అగ్ర‌రాజ్యానికి అధ్య‌క్షుడైన డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ఓటరు కార్డు వ్య‌వ‌హారం ఇప్పుడా దేశంలో హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ట్రంప్ అల్లుడు.. అదేనండి ట్రంప్ మొద‌టి కుమార్తె ఇవాంకాను పెళ్లాడిన జ‌రెడ్‌ కుష్న‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడక్క‌డ అంద‌రి నోట్లో నానుతోంది.

ట్రంప్ అల్లుడి ఓట‌రుకార్డును చూసిన‌ప్పుడు సెక్స్ కాల‌మ్ లో ఫిమేల్ (స్త్రీ) అని ప్రింట్ అయి ఉండ‌టమే దీనికి కార‌ణం. 2009లో ఓట‌రు కార్డు కోసం అప్లై చేసే స‌మ‌యంలో.. ఓట‌రు అప్లికేష‌న్లో అత‌ని  సెక్స్‌ను స్త్రీగా న‌మోదు చేసి ఉన్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ట్రంప్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన డెమొక్ర‌టిక్ రీసెర్చ్ గ్రూప్ తాజాగా ఈ విష‌యాన్ని వెలికి తీసింది. అంతేకాదు.. ట్రంప్ అల్లుడికి అమెరికాలోని ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఓటు ఉంద‌న్న విష‌యాన్ని ద వైర్డ్ అనే ప‌త్రిక ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఓట‌ర్ల జాబితాల్లో ట్రంప్ అనుచ‌రులు త‌మ పేర్లు న‌మోదు చేసుకున్న వైనంపై ప‌లు ఆరోప‌ణలు ఉన్నాయి. తాజాగా ట్రంప్ అల్లుడికి వేర్వేరు చోట్ల ఓటుహ‌క్కు ఉండ‌టం.. అందులో ఒకచోట స్త్రీ అన్న కాల‌మ్ లో టిక్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓట‌రు కార్డులో ట్రంప్ అల్లుడి లైంగిక స‌మాచారం సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో కుష్న‌ర్ స్పందించారు. త‌న అసిస్టెంట్ ఇచ్చిన త‌ప్పుడు స‌మాచారం కార‌ణంగానే త‌ప్పు దొర్లిన‌ట్లుగా వివ‌ర‌ణ ఇచ్చాడు. అప్లికేష‌న్లో అసిస్టెంట్ త‌ప్పుగా ఇచ్చి ఉండొచ్చు. ఓట‌రుకార్డు వ‌చ్చాక అది స‌రిగ్గా ఉందో లేదో కూడా చూసుకోక‌పోవ‌టంతోనే ఈ తిప్ప‌ల‌న్న విష‌యాన్ని ట్రంప్ అల్లుడు ఒప్పుకునేట‌ట్లుగా లేర‌ని చెప్పాలి. ట్రంపే మొండోడంటే.. ఆయ‌న అల్లుడు ఆ మాత్రం మొండిత‌నం ఉండ‌కుండా ఉంటుందా చెప్పండి?
Tags:    

Similar News