ట్రంప్‌ తాజా టార్గెట్ ఈ5 వీసాలు

Update: 2018-06-23 10:34 GMT
దూకుడుకు పెట్టింది పేర‌యిన డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచ‌ల‌న వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ అమెరికా కలలు కనే వారికి ఆందోళన క‌లిగించేవే ఎక్కువ‌. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు సృష్టించిన ట్రంప్ ఇన్నాళ్లు హెచ్‌ - 1బీ​ - హెచ్ 4 వీసా మార్పుల గురించి సంచ‌ల‌న విష‌యాలు వెలువ‌రించారు. ఇదే సిరీస్‌లో మ‌రో వీసా చేరింది.  ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాలను రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది. ఇదో రకంగా భారత్‌ కు చేదు వార్తే.

ఈబీ5 వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్‌ జాబ్‌ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్‌ కార్డు లభిస్తుంది. ప్రతి ఏడాది అమెరికా సుమారు పదివేల మందికి ఈబీ-5 వీసాలను జారీ చేస్తుంది. ఆ వీసాలను పొందుతున్న వారి లిస్టులో భారత్ మూడవ స్థానంలో ఉంది. మనకంటే చైనా - వియత్నాం దేశాలు ఆ జాబితాలో ముందంజలో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన పెట్టుబడిదారులు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈబీ-5 వీసా వ్యవస్థను రద్దు చేయాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది భారత్ నుంచి 500 మంది ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా 700 మంది భారతీయులు ఈ వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అయితే విదేశీయులు ఎక్కువ శాతం పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈబీ-5 వీసాలను రద్దు చేయాలా లేక సంస్కరించాలా అన్న అంశాన్ని తేల్చాలంటూ ఉభయసభలను ట్రంప్ సర్కార్ కోరింది. అయితే ఆ దేశంలోని ఉన్నత స్థాయి మంత్రులందరూ ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా‌ పౌరసత్వ - వలసదారుల సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్‌ ఫ్రాన్సిస్‌ సిస్సానా మాట్లాడుతూ అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. విదేశీయులు మనీలాండరింగ్‌ కు పాల్పడడానికి - గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఫ్రాన్సిస్ ఆరోపించారు.
Tags:    

Similar News