కంపు పోవాల‌ని ట్రంపు పేరు పెట్టారు

Update: 2017-06-24 11:09 GMT
ప్ర‌ధాని మోడీ అమెరికా పర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరుతున్న వేళ హ‌ర్యాణాలోని ఓ గ్రామంలో వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా కునారిల్లుతున్న ఆ గ్రామం ద‌శ‌దిశ మార్చ‌డానికి వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్ర‌ధాని మోడీ - అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ల భేటీ సంద‌ర్భంగా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తే ఎవ‌రో ఒక‌రు ద‌య త‌ల‌చి త‌మ గ్రామాభివృద్ధికి తోడ్ప‌డ‌తార‌న్న ఆశ‌తో వారు కొత్త ఆలోచ‌న చేశారు. త‌మ గ్రామం పేరును ట్రంప్ విలేజ్ గా మార్చారు.

హర్యానాలోని ఆ గ్రామం అస‌లు పేరు మ‌రోరా. ఈ ఊళ్లో మొత్తం 165 ఇళ్లు ఉండ‌గా అత్య‌ధికులు ముస్లింలే. అంతా నిరుపేద‌లు. మరుగుదొడ్లు - నీరు - విద్యుత్‌ లాంటి మౌలిక సౌకర్యాలు లేవు. 165 ఇళ్ల‌లో కేవ‌లం 20 ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి.  మిగతా వారంతా ఆరుబ‌య‌ట‌కు పోవాల్సిందే. దాంతో ఊళ్లో అప‌రిశుభ్ర‌త‌ - అనారోగ్యాలు. స‌రైన ఆదాయ వ‌న‌రులు లేక‌పోవ‌డంతో ఎవ‌రూ మ‌రుగుదొడ్లు క‌ట్టించుకునే స్థితిలో లేరు. స్వచ్ఛ భారత్‌ కింద దేశంలో ఇప్పటికే 80 లక్షల మరుగుదొడ్లను నిర్మించామని కేంద్రం చెప్తున్నా ఇక్క‌డ ఆ జాడ‌లే లేవు. అంతేకాదు... స‌రైన మ‌ట్టి రోడ్డు కూడా లేదు. వ‌ర్షం ప‌డితే మోకాలి లోతు బుర‌ద‌లో దిగి రావాల్సిందే.

ఈ ఊరి గురించి ‘సులభ్‌ ఇంటర్నేషన‌ల్  సంస్థకు తెలిసింది.  ఇక్క‌డ ఉన్న ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు  రోడ్డును నిర్మించడంతో పాటు కమ్యూనిటీ సెంటర్‌ కు రోడ్డును నిర్మించాలని, వితంతువుల పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించింది.  ప్ర‌తి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలని కూడా భావించింది. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు అందరి సహకారం అవసరం కనుక.. ప్ర‌భుత్వం దృష్టిని ఆక‌ర్షించ‌డానికి ఏదైనా చేయాల‌నుకుంది. ప్ర‌ధాని అమెరికా ప‌ర్య‌ట‌న అందుకు స‌రైన స‌మ‌య‌మ‌ని భావించి మ‌రోరా పేరును ట్రంప్ విలేజ్ గా మార్చింది. అధికారికంగా ఈ పేరు మార‌క‌పోయినా గ్రామ‌స్థులు ఇలా మార్చిన విష‌యం మీడియాలో బాగా ఫోక‌స్ అయి కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కు వెళ్తే గ్రామ రూపురేఖ‌లు మారుతాయ‌ని వారంతా ఆశిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News