మిత్రుడి మీద విచారణకు కేసీఆర్ ఓకే చెప్పారు

Update: 2016-04-22 04:44 GMT
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చాలాసార్లు వింటుంటాం. కానీ.. చట్టం తన పని తాను చేసుకోవటానికి అధికారిక అనుమతులు తప్పనిసరి అన్న నిజం బయటకు రాదు. అలాంటి వాస్తవాలు అప్పుడప్పుడు బయటకొచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి నిజం ఒకటి బయటకు వచ్చింది. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం గుర్తుండే ఉంటుంది.

అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన ఒక సభకు హాజరైన ఆయన.. మాటలతో ఎంతగా చెలరేగిపోయారో అందరికి తెలిసిందే. ఆ తరహా వ్యాఖ్యలు చేసిన నేతపై విచారణ జరపటానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు మూడేళ్ల తర్వావ తాజాగా ఇవ్వటం గమనార్హం. అక్బర్ పై నమోదైన కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓకే చెప్పింది.

ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో పొరపాటున అనుకోవచ్చు. కానీ.. గత ఏడాది సైతం అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని మర్చిపోకూడదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇన్నేళ్లుగా ఇవ్వని అనుమతి ఇప్పుడే ఎందుకు ఇచ్చినట్లు? అన్న సందేహానికి సంతృప్తికర సమాధానం రావటం లేదన్నది పలువురి వాదన. మజ్లిస్ ను తమ మిత్రుడిగా చెప్పుకునే తెలంగాణ అధికారపక్షం.. ‘స్నేహితుడి’ మీద విచారణకు ఓకే చెప్పటం వెనుక అసలు కథ ఏమైనా ఉందా? అన్న సందేహం పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News