అడుగు వెనక్కి వేయటానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారా?

Update: 2019-10-17 05:29 GMT
ఎంతకూ తెగని ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటమే కాదు.. సానుకూలంగా స్పందించేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. మెట్టు దిగేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగానే ఉన్నా.. సర్కారు మాత్రం గొంతెమ్మ కోర్కెలు కోరటమే కాదు.. భవిష్యత్తులో మరెప్పుడూ సమ్మె అన్నది చేయమంటూ రాతపూర్వకంగా రాసివ్వాలన్నంత వరకూ విషయం వెళ్లటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

పన్నెండు రోజులు పూర్తి అయి పదమూడో రోజుకు సమ్మె చేరుకున్నా.. ఒక కొలిక్కి ఎందుకు రావట్లేదు? ఉద్యోగులు ఎందుకంత పట్టుదలగా  ఉన్నారన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమ్మె విషయంలో ఒకటి రెండు అడుగులు వెనక్కి వేయటానికి ఆర్టీసీ సంఘాలు సిద్దంగానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందంటున్నారు.

సాధారణంగా సమ్మె లాంటివి చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం చొరవ ప్రదర్శించటం.. పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయటం కనిపిస్తుంది. అదే సమయంలో తొలుత బెట్టు చేసే సంఘాలు.. సర్కారు తీరుతో తమ డిమాండ్ల విషయంలో కాస్త రాజీ పడటం మామూలే. ఇందుకు భిన్నమైన వాతావరణం తాజాగా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో 48 వేల మంది ఉద్యోగుల ఉద్యోగాలు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని సీఎం కేసీఆర్ ఒకటికి రెండుసార్లు చెప్పటమే కాదు.. ఇదే స్టాండ్ మీద ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి వారు తగ్గి.. ఉద్యోగాల్లోకి చేరతానంటే ఫర్లేదు కానీ.. ఒక్క డిమాండ్ ను ఓకే చెప్పటం కుదరదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఈ కారణంతో సమ్మెను అనివార్యంగా కంటిన్యూ చేయాల్సి వస్తోందన్న మాట ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమ్మె చేస్తున్న ఉద్యోగులు సమ్మెను విరమించటమే కాదు.. ఎలాంటి డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకున్నా.. సమ్మె చేసిన దానికి భేషరతు క్షమాపణతో పాటు.. రానున్న రోజుల్లో ఎలాంటి సమ్మెకు తాము తెర తీయమన్న రాతపూర్వక హామీని ఉద్యోగులు ఇస్తే తప్పించి.. వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోమంటూ ప్రభుత్వ పెద్ద నుంచి వచ్చిన మాటతో సమ్మె విషయంలో వెనక్కి తగ్గలేని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News