కొత్తగా పెళ్లి చేసుకునే వారికి టీటీడీ పెళ్లికానుక

Update: 2021-07-08 03:32 GMT
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మీద భక్తులకు ఉండే గురి సంగతి తెలిసిందే. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులకు సరికొత్త పెళ్లికానుకను అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం డిసైడ్ అయ్యింది. వేంకటేశ్వరుడ్ని కొలిచే వారు మాత్రమే కాదు.. కోట్లాది మంది స్వామి వారి ఆశీస్సుల కోసం తపిస్తుంటారు. తమ ఇంట జరిగే పెళ్లి వేళ.. లగ్నపత్రికను స్వామి వారి పాదాల చెంత ఉంచి.. ఆయన ఆశీస్సులు పొందాలని తపించేవారెందరో. కానీ.. ఇలాంటి ఎంతోమంది ఆశ తీరని పరిస్థితి.

ఇలాంటి వారందరికి అవకాశాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే.. పెళ్లి ముహుర్తానికి కనీసం నెల ముందుగా స్వామి వారికి పెళ్లి శుభలేఖను పంపితే.. స్వామివారి ఆశీస్సులు మాత్రమే కాదు.. పెళ్లి కానుకను పంపేందుకు వీలుగా టీటీడీ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. పెళ్లి నిశ్చయమైన వెంటనే..  ముహుర్తానికి నెల ముందుగా స్వామి వారికి మొదటిశుభలేఖను కొరియర్ చేస్తే.. దాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతారు.

అంతేకాదు.. స్వామి వారి కంకణాల్ని వధూవరులకు తిరిగి పంపుతారు. టీటీడీ అందించే పెళ్లి కానుకలో స్వామి వారి అక్షతలు (పెళ్లి తలంబ్రాల్లో కలుపుతారు).. పసుపు.. కుంకుమతో పాటు మహా ప్రసాదం.. వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకాన్ని.. పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. పెళ్లి చేసుకునే వేళ.. ఇంతకుమించిన బహుమతి ఇంకేం ఉంటుంది.

మరి.. టీటీడీ పెళ్లి కానుకను అందుకోవాలంటే ‘శ్రీ లార్డ్‌ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు పోస్టు కానీ.. కొరియర్ కానీ పంపించాల్సి ఉంటుంది. కరోనా వేళలో ఎక్కువ ప్రయాణాలు చేసేందుకు అవకాశం లేని నేపథ్యంలో వధూవరులకు స్వామి వారి ఆశీస్సులు అందించేందుకు వీలుగా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Tags:    

Similar News