సుమారు పది నెలల ఎదురుచూపుల తర్వాత టీటీడీ బోర్డు కు సంబందించి నియామకాలు జరిగాయని మీడియాలో ఫుంకాను పుంకాలుగా వార్తలు వెలువడ్డాయి. "లిస్ట్ లో పేర్లు" అంటూ ప్రచురించిన పేర్లు చూసుకుని మురిసిపోయిన వారు సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టేశారు. కానీ... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. టీటీడీ చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో కధనాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా నియమించినట్లు, కొందరి పేర్ల కూడా బయటికొచ్చాయి కానీ... అవి ప్రభుత్వం ఫైనల్ చేసినవి కాదు! వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో టీటీడీ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. అప్పటి నుంచి నూతన పాలక మండలిని నియమించలేదు. పాలకమండలి నియామకానికి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి..అవన్నీ నిజం కాదు అని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.