టీటీడీ కీల‌క నిర్ణ‌యం...అలాంటి వాళ్ల‌కు నో ద‌ర్శ‌నం

Update: 2020-03-08 11:21 GMT
దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. క‌లియుగ దైవం శ్రీ వెంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకునే వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిసైడ‌యింది. దేశవ్యాప్తంగా 27 కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన నేపథ్యంలో క‌రోనా లక్షణాలు ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రావొద్దంటూ అధికారులు ఆదేశించారు. జలుబు - దగ్గు - జ్వరంతో బాధపడుతున్న భక్తులు తిరుమలకు రావద్దని స్ప‌ష్టం చేసింది.

లక్షలాది మంది భక్తులు ఒకేచోటికి చేరుకున్న పుణ్యక్షేత్రం కావడం - ఒకరి నుంచి ఒకరికి సులువుగా ఈ ప్రాణాంతక వైరస్ సోకే అవకాశం ఉండటం వంటి కారణాల వల్ల ముందు జాగ్రత్త చర్యగా దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గేంత వరకూ అాలాంటి లక్షణాలు ఉన్న భక్తులెవరూ రావొద్దని టీటీడీ అధికారులు స్ప‌ష్టం చేశారు. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలో సమావేశమైన అధికారులు ఆదేశాల మేర‌కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ.. దర్శన భాగ్యాన్ని కల్పించకుండానే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జ్వర పీడితులు అధికంగా ఉన్నట్టయితే వారిని వెంటనే శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్)కు తరలించేలా ఏర్పాట్ల చేసినట్లు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా, ఒక‌వేళ ఎవ‌రైనా అనుకోకుండా ద‌ర్శ‌నానికి వచ్చినట్ల‌యితే వారిని ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి ముందే వెనక్కి పంపించేలా తిరుమలలో ఉన్న అన్ని కాటేజీలు - క్యూ లైన్ల సిబ్బందికి అంతర్గతంగా ఆదేశాలను జారీ చేసినట్లు స‌మాచారం. కాగా, క‌రోనా విష‌యంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప‌లువురు భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News