భక్తులకు టీటీడీ షాక్ మామూలుగా లేదుగా? ఈ బాదుడేంది?

Update: 2023-01-07 02:57 GMT
మనసు ప్రశాంతత కోసం ఏర్పాటు చేసే దేవాలయాలు అంతకంతకు ఖరీదైన వ్యవహారంగా మారిపోవటమా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవస్థానంగా పేరున్న తిరుమలలో ఇప్పటికే ఏదో పేరుతో బాదేసేయటం తెలిసిందే. కొండ మీదకు వెళ్లింది మొదలు తిరిగి వచ్చే వరకు జేబులో చేయి పెట్టకుండా ఏ పని జరగదన్న విషయం తెలిసిందే. దర్శనాలకు కావొచ్చు.. ప్రసాదాలకు కావొచ్చు.. వసతి కోసం తీసుకునే రూంలకు కావొచ్చు. ఇది సరిపోనట్లుగా తాజాగా టీటీడీ వారు భక్తుల మీద మరింత భారంమోపేలా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తిరుమల కొండ మీద వసతి రూంలలో ఆధునికీకరణ పేరుతో పనులు చేపట్టటం వరకు ఓకే. ఆ పేరుతో భారీగా గదుల అద్దెల్ని పెంచేయటం ఏ మేరకు సబబు? అన్నది ప్రశ్న. బటన్ నొక్కి వేలాది కోట్లను సంక్షేమ పథకాల పేరుతో పందారం చేస్తున్న రాష్ట్రంలో.. దేవుడి దర్శనం కోసం వెళ్లే సామాన్య.. మధ్యతరగతి వారికి చుక్కలు కనిపించేలా గదుల అద్దె ధరల్ని భారీగా పెంచటంలో న్యాయం ఉందా? అన్నది ప్రశ్న. పాత వసతి కేంద్రాల్ని మార్పులు చేసేందుకు రూ.110 కోట్ల ఖర్చుతో టెండర్లను ఆహ్వానించారు. అంతవరకు ఓకే.

కానీ.. ఆ పేరుతో గదుల అద్దెల్ని భారీగా పెంచటంలో అర్థం లేదు. తిరుమల మొత్తంలో 6 వేల గదులు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు సామాన్య.. మధ్యతరగతి వారు ఎంచుకునే గదులే ఎక్కువ. అందరికి అందుబాటులో రూం అద్దెలు ఉండే నందకం.. పాంచజన్యం.. కౌస్తుభం.. వకుళ మాత వసతి గ్రహాల్లో ఇప్పటివరకు ఉన్న రోజు వారీ అద్దె రూ.500-600 నుంచి ఏకంగా రూ.1000కు పెంచేశారు.

కొత్త సంవత్సరంలో నారాయణగిరి రెస్ట్ హౌస్ లో గదుల ధర రూ.1700కు పెరిగింది. గతంలో రూ.750 ఉండేది. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 అద్దె ఉన్న గదులకు రూ.1700లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కార్నర్ సూట్ అయితే ఏకంగా రూ.2200లకు తీసుకొచ్చేశారు. ఇప్పటివరకు సాధారణ భక్తులు ఎక్కువగా వసతికి వినియోగించే ఎంఎంసీ.. ఏఎన్ సీ.. హెచ్ వీసీ..లకు రూ.50 ఉండేది. రాంభగీచా.. వరాహస్వామి గెస్ట్ హౌస్.. ఎస్ఎన్ జీహెచ్.. ఏటీసీ.. టీబీసీ.. సప్తగిరిలలో రూ.100 ఉండేది.

తాజాగా వీటి ధరలను కూడా భారీగా పెంచేందుకు వీలుగా ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ చేసే బదులు.. వీఐపీ.. సెలబ్రిటీ ఎవరైనా సరే.. వారికి అందించే ఒక్కో దర్శనానికి రూ.కోటి చొప్పున టికెట్ పెడితే అసలీ బాదుడే ఉండదు కదా? ఆ ధైర్యం.. సాహసం.. టీటీడీ చేయగలదా? సామాన్యులకు షాకిచ్చే బదులు.. ప్రముఖులకు.. సెలబ్రిటీలకు ఇవ్వొచ్చు కదా? అలా ఎందుకు చేయరు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News