ఎక్కడైనా పొత్తే కానీ వరంగల్ లో కాదు

Update: 2015-10-24 10:34 GMT
తెలుగుదేశం, బీజేపీల పొత్తుకు వరంగల్ ఉప ఎన్నిక చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. అలాగే బీజేపీ కూడా తొలి నుంచీ పొత్తులో భాగంగా ఆ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని చెబుతూ వస్తున్నది. తీరా ఎన్నికల తేదీ వెల్లడయ్యే సరికి ఇరు పార్టీల కార్యకర్తలూ కూడా తమ అభ్యర్థే రంగంలో ఉండాలని పట్టుపడుతున్నాయి. వారికి ఆశావహులు అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భవన్ లో, బీజేపీ నాయకులు బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇరు పార్టీల నేతలూ కూడా సమావేశమై వరంగల్ అభ్యర్థిత్వంపై చర్చించే అవకాశం ఉంది. ఇలా ఉండగా రెండు పార్టీల నాయకులూ కూడా మిత్ర ధర్మం పాటించాలని అంటున్నారు. మెదక్ లోక్ సభ, రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం మిత్ర ధర్మం పాటించి బీజేపీకి మద్దతు ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అదే మిత్ర ధర్మాన్ని ఇప్పుడు బీజేపీ పాటించి తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారంటున్నారు. మొత్తం మీద వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక రెండు పార్టీల పొత్తపై ఒకింత ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Tags:    

Similar News