బాబు బ్యాచ్ ప‌రువు పోగొట్టుకొని క‌వ‌ర్ చేసుకుంటోంది

Update: 2018-09-22 10:55 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికారమే లక్ష్యంగా జట్టు కట్టిన మహా కూటమి పార్టీల మధ్య తొలిదశ చర్చలు పూర్తయిన సంగ‌తి తెలిసిందే. పొత్తులు - పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై పార్టీలు...కాంగ్రెస్ కు ప్రతిపాదనలు అందజేశాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలపై అంచనా వేసి...సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చలు జరపాలని మహాకూటమి నేతలు నిర్ణయించారు. అయితే ఇంత‌లోగానే ఓ జాబితాను టీడీపీ పెద్ద‌లు లీక్ చేశారు. ఈ స్థానాల నుంచి తాము బ‌రిలో ఉండ‌నున్నామ‌ని పేర్కొంటూ...పేర్ల‌తో స‌హా వారి వివ‌రాల‌ను వెల్ల‌డించార‌ని మీడియాలో వైర‌ల్ అయింది. దీనిపై మ‌హాకూట‌మి నేత‌లు భ‌గ్గుమన‌డంతో తాజాగా టీడీపీ ప‌రువు కాపాడుకునే ప‌నిచేస్తోంది.

మ‌హాకూట‌మి పొత్తుల్లో 30 స్థానాలను కోరుతున్న తెలుగుదేశం పార్టీ....20 మందికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీకిచ్చింది. జాబితాలో మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు - పార్టీ సీనియర్ నేతలకు చోటు కల్పించారు అంటూ ఓ జాబితా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ కు ఇచ్చిన జాబితాలో...కనీసం 15 సీట్లు పట్టుబట్టాలని టీటీడీపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో 15 సీట్లలో గెలుపొందిన టీడీపీ...ఈ ఎన్నికల్లోనూ గెలిచే స్థానాలను వదిలిపెట్టకూడదని నిర్ణయించిందనే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై మ‌హాకూట‌మిలోని మిగ‌తా పార్టీలు తీవ్ర అసహ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా టికెట్ ఆశించిన టీడీపీ నాయ‌కులు సైతం భ‌గ్గుమ‌న్నారు. వెర‌సి టీడీపీ పెద్ద‌ల‌కు త‌ల‌బొప్పి కట్ట‌డంతో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

టీడీపీ త‌మ పార్టీ అభ్య‌ర్థుల పేర్ల‌ను కాంగ్రేస్ పార్టీకి ఇచ్చిన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు పూర్తిగా అవాస్త‌వని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ``ప్ర‌స్తుతం పార్టీల మ‌ద్య పొత్తుల సంప్ర‌దింపులు కోన‌సాగుతున్నాయి.సీట్ల పంప‌కాలు పూర్తి కాలేదు. మ‌హాకుట‌మిలో ఏ పార్టీ కూడా త‌మ పార్టీ అభ్య‌ర్దుల‌ పేర్ల‌ను ఒక‌రివి ఇంకొక‌రికి ప్ర‌తిపాదించ‌లేదు. ఎలాంటి జాబితా కూడా ప్ర‌క‌టించ‌లేదు. పార్టీ అభ్య‌ర్దుల ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. టీఆర్ ఎస్ పార్టీ మ‌హాకుట‌మిని విచ్చిన్నం చేయ‌డానికి చాన‌ల్స్ ద్వారా అస‌త్య ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్ర‌స్తుతం చాన‌ల్స్‌ లో వ‌స్తున్న వార్త‌లను తీవ్రంగా ఖండిస్తున్నాం`` అంటూ  ఎల్‌.ర‌మ‌ణ పేరుతో ఆ ప్ర‌క‌ట‌న విడుద‌లయింది. అయితే, ఈ జాగ్ర‌త్త ఏదో ముందే ప‌డితే బాగుండేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News