ట్రంప్ సైతం ఫీలయ్యేలా చేసిన తులసి

Update: 2019-12-19 14:30 GMT
దేశం ఏదైనా సరే.. సమకాలీన రాజకీయాలు ఏ మాత్రం బాగోలేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జాతీయవాదులు అధికారాన్ని చేజిక్కించుకుంటుంటే.. ఉదారవాదులు చేష్టలుడిగిపోతున్నారు. ఇలాంటివేళ.. జాతీయవాదుల దూకుడుకు కళ్లెం వేసేదెలా? అన్న ప్రశ్నలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ఇలాంటివేళ.. గెలుపు తప్పించి.. విలువలు.. మర్యాదలన్న వాటికి చోటు లేదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అందుకు భిన్నంగా అమెరికా రాజకీయంలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరూ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అభిశంసన తీర్మానాన్ని ఆమోదించటం తెలిసిందే. రాజకీయంగా ట్రంప్ ను దెబ్బ తీసేందుకు ఇదో అస్త్రమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ అభిశంసనతో ట్రంప్ అధ్యక్ష పదవి పోదు కానీ పరువు పోవటం మాత్రం ఖాయమని చెబుతారు. ఇదిలా ఉంటే.. ఈ అభిశంసన తీర్మానంలో ఓటు వేసే విషయంలో భారతీయ మూలాలున్న తులసి గబ్బార్డ్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

ఆ మాటకు వస్తే.. ఆమె వ్యవహరించిన తీరుకు అధ్యక్షుడు ట్రంప్ సైతం అవాక్కు కావటం ఖాయమని చెప్పాలి. ఎందుకంటే.. ట్రంప్ కు ధీటైన అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి.. మధ్యలో వెనక్కి తగ్గిన ఆమె.. ట్రంప్ ను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరని భావిస్తారు. అందుకు భిన్నంగా ట్రంప్ మీద పెట్టిన అభిశంసన తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా కానీ.. ప్రతికూలంగా కానీ ఓటు వేయకుండా కేవలం ఓటింగ్ కు హాజరయ్యానన్న ఓటును మాత్రమే వేయటం విశేషంగా మారింది.

ఆమె తీరును సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు సైతం తప్పు పడుతుంటే.. తులసీ మాత్రం తాను చేసిన చర్యను సమర్థించుకుంటున్నారు. తనపై వెల్లువెత్తిన విమర్శలకు సమాధానంగా ఆమె వినిపించిన వాదన.. ఆమె ఇమేజ్ ను మరింత పెంచేలా ఉందని చెప్పాలి. తాను తీసుకున్న నిర్ణయంతో చాలామంది ఏకీభవించొచ్చు కానీ.. తాను మాత్రం అన్ని ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నేనెంతగానో ప్రేమించే నా దేశమే నాకు ముఖ్యం.. 658 పేజీల అభిశంసన నివేదిక చదివిన తర్వాత.. అందుకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు వేయాలన్న విషయంలో స్పష్టత లేకుండా పోయిందన్నారు. అధ్యక్షుడు ట్రంప్ చేసిన తానికి ఆయన కూడా పశ్చాత్తాపపడుతున్నారని తాను నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు. దేశాన్ని విభజించే ఎలాంటి నిర్ణయాలకు తాను అనుకూలం కాదన్న ఆమె.. అధ్యక్షుడ్ని గద్దె దింపేందుకు కేవలం రాజకీయ అంశాలే ముఖ్యకారణం కాకూడదన్న మాటను చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో ఇలాంటి విలువలు తులసి లాంటి అతి తక్కువమంది రాజకీయనేతల్లోనే కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.


Tags:    

Similar News