ఖమ్మం ఎంపీ సీటుపై తుమ్మల కన్ను.?

Update: 2019-02-19 09:08 GMT
రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు ఈ దఫా ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని వర్గపోరు కారణంగా దారుణంగా ఓడిపోయారు. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారే.. కేసీఆర్ తో సమానంగా రాజకీయాల్లో ఎదిగిన తుమ్మల పోయిన సారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈసారి మాత్రం ఓడిపోయి దూరమయ్యారు. తుమ్మల ఓటమికి ప్రధానంగా జిల్లాలో ఉన్న వైరి వర్గం.. సొంత టీఆర్ ఎస్ లోని వర్గ, అసమ్మతి పోరే కారణంగా చెప్పవచ్చు.

పాలేరులో తుమ్మల ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన దృష్టి ఖమ్మం పార్లమెంట్ పై పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసేందుకు తుమ్మల ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలొస్తున్నాయి.

తుమ్మల మద్దతుదారులు తాజాగా ఖమ్మం ఎంపీగా పోటీచేయాలని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. సీనియర్లకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తుమ్మలకు ఎంపీ టికెట్ లభిస్తుందని ఆయన అనుచరగణం భావిస్తోంది.

తుమ్మల పాలేరులో ఓటమి తర్వాత సమీక్షించుకున్నారు. ఇటీవలే గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరినీ పిలిచి సమాలోచనలు జరిపారు. పంచాయతీలకు వెళ్లి ఆరాతీశారు. కేడర్ ను బలోపేతం చేయడానికి నడుం బిగించారు. పార్టీని - జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ.. నియోజకవర్గంలో సుస్థిర అభివృద్ధి చేసినా తనను ఎందుకు ఓడించారని నిలదీశారు. దీంతో కార్యకర్తలు నేతలు ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామని.. ఖమ్మం ఎంపీగా పోటీచేయాలని తుమ్మలపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. తుమ్మల కూడా ఎంపీగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News