తుమ్మ‌ల వేలికి సిరా చుక్క.. వేటు ప‌డేది ఎవ‌రికి?

Update: 2019-05-12 05:46 GMT
అనుకుంటాం కానీ ఎన్నిక‌ల ప్రాసెస్ చాలా క‌ష్ట‌మైంది. అన్నింటికి మించిన పోలింగ్ స్టేష‌న్ నిర్వాహ‌ణ‌.. అందులో విధులు నిర్వ‌ర్తించే సిబ్బంది ప‌రిస్థితి మ‌రింత క‌ఠినంగా ఉంటుంది.చిన్న పొర‌పాటుకు వారు భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి వెలుగు చూసింది.

మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటు వేసిన వైనం ఇప్పుడు అధికారుల‌కు చుట్టుకోనుంది. ఓటు వేసేందుకు వ‌చ్చిన వారికి వేయాల్సిన వేలికి సిరాచుక్క వేయ‌కుండా మ‌రో వేలికి వేస్తే.. దానిపై చ‌ర్య‌లు తీసుకుంటారు. తుమ్మ‌ల వ్య‌వ‌హారంలో ఇలానే చోటు చేసుకుంది.

ఎడ‌మ‌చేతికి వేయాల్సిన సిరాగుర్తును తుమ్మ‌ల‌కు కుడిచేతి వేలికి సిరా గుర్తు వేశారు. ఈ ఉదంతంపై మీడియాలో వార్త‌లు రావ‌టంతో ఈ ఉదంతం ఇలా ఎందుకుజ‌రిగిందో తెలుసుకోవ‌టం కోసం ఆర్డీవో విచార‌ణ‌ను షురూ చేశారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ద‌మ్మ‌పేట మండ‌లం గండుగుల‌ప‌ల్లిలో తాజాగా ఆయ‌న త‌న ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా పోలింగ్ సిబ్బంది తుమ్మ‌ల ఎడ‌మ‌చేతి వేలికి కాకుండా కుడిచేతి మ‌ధ్య వేలికి సిరా గుర్తు వేశారు. దీనికి సంబంధించిన వార్త‌లు మీడియాలో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఉదంతం ఎందుకు చోటు చేసుకుంద‌న్న విష‌యాన్ని తేల్చేందుకు విచార‌ణ క‌మిటీని నియ‌మించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మాజీ మంత్రి తుమ్మ‌ల ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వ‌చ్చిన వేళ‌లో టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు బూత్ లోకి వ‌చ్చార‌ని.. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న గంద‌ర‌గోళంలో ఇలా జ‌రిగి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఎంత గంద‌ర‌గోళం జ‌రిగినా.. త‌మ ప‌ని తాము చేయాల్సిన సిబ్బంది.. అందుకు భిన్నంగా చేయ‌టం వ‌ల్ల చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News