కేసీఆర్ ద‌గ్గ‌ర తుమ్మ‌ల వెయిట్ త‌గ్గుతోందా?

Update: 2016-05-27 07:14 GMT
సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌ద్ద వెయిట్ త‌గ్గుతోందా? త‌న జిల్లాలో ప‌ట్టు సాధించుకునే క్ర‌మంలో తుమ్మ‌ల వైఫ‌ల్యం చెందారా? ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ఎద‌గ‌కుండా చేస్తున్నారా? ఇవి ఇపుడు గులాబీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న‌చర్చ‌.

సీనియ‌ర్ నేత‌గా పేరున్న‌ప్ప‌టికీ 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పరాజ‌యం పాల‌యిన సంగ‌తి తెలిసిందే.  అయితే తుమ్మ‌ల సీనియారిటీని గుర్తించి ఆయ‌న్ను టీఆర్ ఎస్‌ లో చేర్చుకున్న కేసీఆర్ మ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఏడాదిన్నర కాలంగా మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన శానన మండలికే పరిమితమై కార్యకలాపాలు సాగించాల్సి వచ్చింది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన‌ పాలేరు ఉపఎన్నికలో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన తుమ్మ‌ల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాసనమండలి నుంచి ఆయన సీటును శాసనసభకు బదలాయించారు. అయితే మండలి స్థానానికి రాజీనామా చేసిన తుమ్మల తిరిగి ఆ స్థానాన్ని జిల్లా నేతకు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారనే టాక్ న‌డుస్తోంది.

పాలేరు ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ తుమ్మల విజయం సాధిస్తే ఎమ్మెల్సీ స్థానం జిల్లా టీఆర్ ఎస్‌ అధ్యక్షుడు ఎస్‌ బీ బేగ్‌ కు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. పార్టీ కోసం ముందునుంచి శ్ర‌మించిన నాయ‌కుడు కావ‌డం, మైనార్టీ స‌మీక‌ర‌ణం తోడ‌వ‌డంతో ఈ అంచనాలు వెలువ‌డ్డాయి. అయితే మరో మైనారిటీ నేత - మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో బేగ్‌కు భంగపాటు తప్పలేదు. అయితే తుమ్మలకు ఆప్తుడుగానే ఉండే బేగ్‌ కు ఎమ్మెల్సీ స్థానం ఇప్పించడం కోసం మంత్రివర్యులు ఎందుకు ప్రయత్నం చేయలేదనే చర్చ మొదలైంది. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎం వద్ద తుమ్మలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈక్రమంలో తుమ్మల పట్టుబడితే కేసీఆర్ కాదనే అవకాశమేలేదని అంతా భావిస్తున్నారు. అయినా బేగ్‌ ను కాదని మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కు ఈ స్థానాన్ని కేటాయించడం పట్ల టీఆర్ ఎస్ వర్గాల్లో చ‌ర్చోప‌చ‌ర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అత్యంత ఆప్తుడుగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు కోరితే కేసీఆర్ కాద‌న్నారా? లేక‌పోతే మ‌రో జిల్లా నేత‌కు అవ‌కాశం ఎందుకు ఇప్పించాల‌ని తుమ్మ‌ల భావించారా అనేవి టీఆర్ ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు.
Tags:    

Similar News