తుపాకీ సర్వే: 2023లో కేసీఆర్ ను ఢీకొట్టే నేత ఈయనే?

Update: 2021-07-12 06:56 GMT
ఇన్నాళ్లు హనీమూన్ లా సాగిన కేసీఆర్ పాలనకు ఇప్పుడు ఆ పీరియడ్ ముగిసిపోయింది. బయటకు రాకుండా ప్రగతి భవన్ లోనే ఉన్నా కేసీఆర్ సైతం జిల్లాల పర్యటనలు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజల్లోకి రావాల్సి వచ్చింది.  ఇన్నాళ్లు ప్రతిపక్ష కాంగ్రెస్ డీలా పడిపోయి.. అప్పుడప్పుడూ మెరిసే బీజేపీ వల్ల తనకు ఎలాంటి ప్రమాదం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, కొత్త పార్టీతో షర్మిల రంగప్రవేశం చేయడం.. ఉద్యమాలకు రెడీ అవ్వడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గులాబీ టీం కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇన్నాళ్లు తెలంగాణలో కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాట.. కానీ ఇప్పుడు మరో లెక్కలా మారింది. రేవంత్ రెడ్డి, షర్మిలలు  తెలంగాణలో కేసీఆర్ అమలు చేయని వాటిని ఎత్తుకున్నారు. వాటిపై పోరుబాట పట్టారు. కేసీఆర్ ను బ్లేమ్ చేసే పనిలో పడ్డారు. అందుకే కేసీఆర్ సైతం ఇటీవల హడావుడిగా 50వేల ఉద్యోగ ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక రేపటి నుంచి షర్మిల సైతం ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షకు దిగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తాడిపత్రిలో రేపు షూరూ చేయబోతున్నారు.రేవంత్ సైతం పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ రాజకీయవేడిలో మా ‘తుపాకీ.కామ్’ ఓ సర్వే నిర్వహించింది. 2023 ఎన్నికల్లో కేసీఆర్ ను ఢీకొట్టే నేత ఎవరు అని పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.

-కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే భావిస్తున్నట్టు వెల్లడైంది. ఆయనే కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అని ఏకంగా 66.15శాతం మంది అభిప్రాయపడడం విశేషం. దీన్ని బట్టి కాంగ్రెస్ నే జనం ప్రత్యామ్మాయంగా రేవంత్ వచ్చాక భావిస్తున్నట్టు తెలుస్తోంది.

-తెలంగాణలో దూకుడుగా రాజకీయాలు చేస్తున్న బీజేపీని, ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ను ప్రజలు కేసీఆర్ ప్రత్యర్థిగా భావించడం లేదు. ఆయనకు కేవలం 15.96శాతం మంది మాత్రమే ఓటు వేశారు. కేసీఆర్ కు సరితూగగల నేత బండి సంజయ్ కాదని ప్రజలు తీర్పునిచ్చారు.

-ఇక తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఆంధ్రా ఆడకూతురు షర్మిలను అసలు ప్రజలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆమెకు కేవలం 9.67శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా ఆమెను పరిగణించడం లేదు. వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో అస్సలు ఉండదంటూ కుండబద్దలు కొట్టారు. ఆమెకు మనుగడ కష్టమన్నారు. ఈ సర్వేలో మెజార్టీ పీపుల్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా రాణించలేదని తేల్చారు.

ఇక ఈ ముగ్గురిలో ఎవరో చెప్పలేమని 8.22శాతం మంది ఎంపిక చేసుకోలేకపోయారు. కేసీఆర్ ప్రత్యర్థిని కనిపెట్టలేకపోయారు.

ఇలా సర్వేలో దాదాపు 66.15శాతం మంది కేసీఆర్ కు ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం విశేషం. దీంతో రాబోయే తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నాయి.  టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి జైలుకెళ్లినా సరే కేసీఆర్ పై పోరాటం ఆపలేదు. గట్టిగా పోరాడాడు. ఆ పోరాట ఫలితమే.. ఇప్పుడు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేలా చేసింది. ఏడేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుడ్డిగా నమ్మి పార్టీని తెలంగాణలో మూడోస్థానానికి పరిమితం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో పనికాదని తెలిసిపోయింది. అందుకే అందరినీ పక్కనపెట్టి ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చినా సరే కేసీఆర్ ను ఢీకొట్టే రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం పట్టకట్టడం విశేషం. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో బండి సంజయ్ లా దూకుడుగల నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. అతడి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా కాంగ్రెస్ శ్రేణుల్లో విపరీతమైన అభిమానం సొంతం.. ఇన్నాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని ఆపార్టీ వర్గాలే అంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.  రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేసీఆర్ ను ఢీకొట్టేలా తయారైందని చెప్పొచ్చు.
Tags:    

Similar News