సుద్దులు చెప్పే ఛాన‌ళ్లదంతా గురవింద నీతేనా?

Update: 2018-03-25 11:30 GMT
వినేవాడు ఉంటే చెప్పేవాడు చెల‌రేగిపోతాడ‌ని ఊరికే అన‌లేదు మ‌రి. గౌర‌వ‌ప్ర‌దంగా ఉండే పాత్రికేయాన్ని నానా కంపు చేయ‌టంలో టీవీ ఛాన‌ళ్లు ముందు ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విజువ‌ల్ మీడియా రాక ముందు మీడియాకు.. త‌ర్వాత మీడియాకు ఏ మాత్రం సంబంధం లేని ప‌రిస్థితి. వార్త‌ల వేగం ఎంత‌గా పెరిగిందో.. అంతే తీరులో వార్త‌ల నాణ్య‌త అంతేస్థాయిలో ప‌డిపోయింది. ఇది స‌రిపోన‌ట్లుగా ఇప్పుడు డిజిట‌ల్ మీడియా కూడా వరుస‌లోకి వ‌చ్చి చేరింది. అయితే.. ప‌రిమిత వ‌ర్గాల వారికి మాత్ర‌మే డిజిట‌ల్ మీడియా ప్ర‌భావం చేస్తున్న వేళ‌.. దాని కార‌ణంగా జ‌రిగే న‌ష్టం అంతే ప‌రిమితంగా ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఇటీవ‌ల కాలంలో టీవీ ఛాన‌ళ్ల పైత్యం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. వారికి కావాల్సింది ఏ వారానికి ఆ వారం ప్ర‌క‌టించే టీఆర్పీ రేటింగ్‌. దీని కోసం వారెన్ని ప‌నులు చేస్తారో ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎందుకీ టీఆర్పీ రేటింగ్ ఆరాటం అంటే..ఛాన‌ళ్ల‌కు వ‌చ్చే ఆదాయానికి మూలం టీఆర్పీ రేటింగే. రేటింగ్ లో వ‌చ్చే స్థానానికి త‌గ్గ‌ట్లే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయి. దీంతో.. టీఆర్పీ రేటింగ్ పెంచుకోవ‌టానికి ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటున్న ప‌రిస్థితి.

ఈ ప‌రుగు పందెంలో మిగిలిన వారి కంటే ధీటుగా ప‌రిగెత్త‌ని వారు.. స్మార్ట్ వ‌ర్క్ మొద‌లు పెట్టారు. అయితే.. అదంతా మంచిగా చేస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ..నెగిటివ్ గా చేయ‌టంతోనే ఇబ్బంది.

తెలుగులో ఐదారు న్యూస్ ఛాన‌ళ్ల నుంచి ఇప్పుడు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర ఇర‌వై వ‌ర‌కూ ఛాన‌ళ్లు ఉన్నాయి. మ‌రి.. ఇందులో చాలావ‌ర‌కూ న‌ష్టాల్లో న‌డుస్తున్న‌వే. మ‌రి.. ఇలాంటి వేళ‌.. ఆ ఛాన‌ళ్ల‌లో ప‌ని చేసే సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తున్నారు? అంటే.. అదో దేవ ర‌హ‌స్యంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నెట్ వ‌ర్క్ లో ప‌ని చేసే రిపోర్ట‌ర్ల‌కు.. వీడియోగ్రాఫ‌ర్ల‌కు రెమ్యున‌రేష‌న్ ఎలా ఇస్తున్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

దీనికి స‌మాధానం వెతికితే.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ‌ధ్య‌న ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన ధోర‌ణిని కొన్ని ఛాన‌ళ్లు అనుస‌రిస్తున్నాయి. యూట్యూబ్ లో కొన్ని సంచ‌ల‌న వీడియోలు ఉంచేసి.. వాటికో ఆస‌క్తిక‌ర ట్యాగ్ లైన్ రాసేసి పోస్ట్  పోస్తే.. లైకుల ఎక్కువ‌గా వ‌స్తే ఆదాయం వ‌చ్చే ప‌రిస్థితి.  దీంతో.. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా కొన్ని అన‌వ‌స‌ర‌మైన అంశాల‌పై ఇష్టారాజ్యంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. ఆ వీడియోను ముక్క‌లు ముక్క‌లు చేసి.. ఆక‌ర్ష‌ణీయ‌మైన హెడ్డింగ్ లు పెట్టి వ‌దులుతున్నారు. ఆదాయం కోసం కొన్ని ఛాన‌ళ్లు అయితే.. అడ్డ‌మైన అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేలా చేసి వాటిని ముక్క‌లు ముక్క‌లుగా యూట్యూబ్ ఛాన‌ల్ లో పెట్టేస్తున్నాయి.

ఇలా ప‌క్క‌దారి ప‌ట్టేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ ఉన్న ఈ ఛాన‌ళ్లు గురివిందె సామెత‌ను మ‌ర్చిపోతున్నాయి. త‌మ కింద ఉన్న న‌లుపును ప‌ట్టించుకోకుండా నిత్యం స‌మాజానికి.. స‌గ‌టు జీవికి నీతులు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దీంతో.. నీతులు చెప్ప‌టం... ఆ క్ర‌మంలో నోరు జార‌టం ఎక్కువైంది. ఇటీవ‌ల సినిమా జ‌నాల‌పై ఛాన‌ళ్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాయి.

రంగం ఏదైనా అనుచితంగా ఎవ‌రు మాట్లాడినా త‌ప్పే. దాన్ని త‌ప్పు ప‌ట్టాల్సిందే. కానీ.. న్యాయ నిర్ణేత స్థానంలో కూర్చున్న ఛాన‌ల్ ప్ర‌తినిధి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న వైనం వికారాన్ని క‌లిగించ‌టంతో పాటు.. ప్రేక్ష‌కుడికి బోర్ కొట్టిస్తున్నాయి. అంతేకాదు.. కొన్నిసార్లు ఆవేశాన్ని ర‌గిలించేలా చేయ‌టం.. సెంటిమెంట్ ను రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటివి ఏమాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని ఛాన‌ళ్లు గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News