హైదరాబాదే : ఆస్తిపన్ను కట్టలేదని టీవీ జఫ్తు చేశారు

Update: 2020-06-21 05:15 GMT
హైదరాబాద్ లో రూల్ అంటే రూలే.. అది కూడా కొన్నిచోట్లే. చేతిలో అధికారం ఉన్న అధికారులు కొన్ని సందర్భాల్లో రూల్ బుక్ లోని నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ లోని మణికొండలో చోటు చేసుకుంది. ఆస్తిపన్నుకట్టని కారణంగా ఇంట్లోని సామాగ్రిని సీజ్ చేసిన సిత్రం చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు.. మూడేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 15 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటిని అందుకున్న యజమానుల వాదన వేరుగా ఉంది.

ఇదిలా ఉంటే.. శనివారం మణికొండ మున్సిపల్ అధికారులతో పాటు ఆరుగురు సిబ్బంది ఇంటికి వెళ్లారు. పన్ను చెల్లించలేదని అడిగారు.. తనకు పన్ను ఎక్కువ వేశారని.. వివరాలు సరిచేస్తే చెల్లిస్తామని తాము లేఖరాసినట్లు చెప్పారు. దీనికి బదులుగా తాము వేసిన పన్ను సక్రమంగా ఉందంటూ మేనేజర్ వాదనకు దిగారు. ఇదే సమయంలో సిబ్బంది ఇంట్లోని టీవీని తీసుకొని జఫ్తు చేశారు.

దీంతో షాక్ తిన్న యజమాని.. ఇదేం పద్దతని ప్రశ్నించగా.. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించినట్లు పేర్కొన్నారు. దీంతో.. నోటీసులు అందుకున్న యజమానులు.. చివరకు రూ.8వేలు చెల్లించి టీవీని తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ తదితరులు చేరుకొని.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలా ఇదేం పన్ను వసూళ్ల కార్యక్రమంటూ అధికారుల్ని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లు చేసే తీరు ఇది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News