దారుల‌న్ని మూసుకుపోతున్నాయ్ ర‌విప్ర‌కాశ్‌!

Update: 2019-05-18 04:23 GMT
ఆశ‌కు హ‌ద్దు ఉండాలి. కానీ.. ఆశ ఎయిడ్స్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైంది. దాని పాళ్లు పెరిగేకొద్దీ.. అత్యాశ‌గా మారి విచ‌క్ష‌ణను చంపేస్తుంది. నిత్యం నీతులు చెబుతూ.. క‌నిపించేటోళ్లంద‌రికి విలువ‌ల పాఠాలు చెప్పే ర‌విప్ర‌కాశ్ ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారిందంటున్నారు. తానేం చెబితే.. దాన్ని చేయ‌టానికి సిద్ధ‌మైన భాగ‌స్వాముల‌ను చేజేతులారా చేజార్చుకున్న‌ట్లు చెబుతున్నారు.

అలందా మీడియా పేరుతో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మైహోం రామేశ్వ‌ర‌రావు అండ్ కో క‌లిసి టీవీ9లో 90 శాతానికి పైనే వాటా కొనుగోలు చేసిన మొద‌ట్లో ర‌విప్ర‌కాశ్ మీద చాలా న‌మ్మ‌కం ఉంచుకున్నార‌ట‌. ఒక‌ద‌శ‌లో ఆయ‌న చేతికే బాధ్య‌త అప్ప‌గించాల‌ని భావించార‌ట‌. చివ‌ర‌కు డైరెక్ట‌ర్ల మార్పు అంశం కూడా ఆయ‌నకే వ‌దిలేశార‌ట‌.

ఇంత‌గా ర‌విప్ర‌కాశ్ ను న‌మ్మితే.. త‌మ‌కు చుక్క‌లు చూపిస్తున్న తీరుతో వారు షాక్ తిన్న‌ట్లు చెబుతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో పాల‌సీ మేట‌ర్ కు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే స‌రిపోతుంద‌న్న సందేశాన్ని ఇచ్చిన‌ప్పుడు ర‌విప్ర‌కాశ్ రియాక్ష‌న్ వేరుగా ఉండ‌టం.. చివ‌ర‌కు త‌మ‌ను టీవీ9 ఆఫీసుకు వ‌చ్చేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం వారిని ఆలోచ‌న‌ల్లో ప‌డేసిన‌ట్లుగా చెబుతారు.

వంద‌ల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మీడియా హౌస్ లో త‌మ‌కే మాత్రం సంబంధం లేన‌ట్లుగా ఉండాల‌న్న మాట‌లు ఒక ఎత్తు అయితే.. బ్యాక్ ఎండ్ లో త‌మ‌ను దెబ్బ తీసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లుగా ఉప్పందంటంతో కొత్త భాగ‌స్వాములు అలెర్ట్ అయ్యార‌ని చెబుతారు. ఎందుకైనా మంచిద‌న్న ఉద్దేశంతో ఒక‌ట్రెండు విష‌యాల్లో క్రాస్ చెక్ చేసిన‌ప్పుడు లెక్క తేడాగా ఉన్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

అన్నింటికి  మించి.. డైరెక్ట‌ర్ల పేర్ల‌ను అధికారికంగా న‌మోదు చేసే విష‌యంలో చేసిన జాగు.. వారి క‌ళ్లు విచ్చుకునేలా చేయ‌ట‌మే కాదు.. ర‌విప్రకాశ్ చేతుల్లో నుంచి టీవీ9ను తీసేసుకోవ‌టానికి మించిన మంచిప‌ని ఉండ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. అంద‌రి మాదిరి టీవీ9 ర‌విప్ర‌కాశ్ చేతుల్లో ఉంటే మంచిద‌ని కొత్త వాటాదారులు భావించినా.. త‌మ‌ను భాగ‌స్వాములుగా చూడ‌క‌పోవ‌టం.. మొత్తం త‌న‌దే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే లెక్క మొత్తం తేడా కొట్టిన‌ట్లు చెబుతున్నారు. మొత్తం మీరే చూసుకోండ‌న్న ల‌డ్డూ లాంటి ఆఫ‌ర్ ను అత్యాశ‌తో ర‌విప్ర‌కాశ్ చెడ‌గొట్టుకున్నార‌న్న మాట మీడియా వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. త‌న‌ను దాటి ఎవ‌రూ వెళ్ల‌లేర‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ర‌విప్ర‌కాశ్ తీసుకున్న నిర్ణ‌యాలు.. తాజా ప‌రిస్థితికి కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. చేసుకున్నోడికి చేసుకున్నంత మ‌హ‌దేవ అని ఊరికే చెప్ప‌లేదుగా!


Tags:    

Similar News